KA Paul: చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోలేదు: కేఏ పాల్

KA Paul Says Chandrababu Naidu Still Hasnt Taken His Blessings
  • మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం
  • ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్ వేశానన్న పాల్
  • ఇది పీపీపీ కాదు, బిలియనీర్ల ప్రోగ్రామ్ (పీపీబీ) అంటూ విమర్శ
ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది పీపీపీ కాదని, పీపీబీ (బిలియనీర్ల ప్రోగ్రామ్) అని ఆయన ఆరోపించారు. మెడికల్ కాలేజీలను నారాయణ కొన్నా, మరెవరు కొనుగోలు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. ఈ విషయమై తాను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశానని తెలిపారు.

గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పీపీపీ విధానం వల్ల కర్ణాటకలో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని గుర్తు చేశారు. "ప్రభుత్వ ఆస్తులను 33 ఏళ్ల లీజు పేరుతో అమ్మేస్తున్నారు. స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నట్టే మెడికల్ కాలేజీలను కట్టబెడుతున్నారు. క్యూబా లాంటి చిన్న దేశంలోనే ఉచిత విద్య, వైద్యం అందుబాటులో ఉంది. మన దగ్గర ఎందుకు సాధ్యం కాదు?" అని పాల్ ప్రశ్నించారు. పాలించడం చేతకాకపోతే రాజీనామా చేయాలని, ప్రభుత్వాన్ని ఎలా నడపాలో తనకు తెలుసని అన్నారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. "గత ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పవన్ ఇప్పుడు ఎక్కడున్నారు? సుగాలి ప్రీతి ఘటనపై ఎందుకు మాట్లాడరు?" అని నిలదీశారు. విశాఖపట్నం సమ్మిట్‌లో లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పారని, దానిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాని, ముఖ్యమంత్రికి రూ.5 వేల కోట్లు ముడుపులు అందకుండానే నారాయణ లాంటి వారికి మెడికల్ కాలేజీలు అప్పగిస్తారా? అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. "నాకు FCRA అనుమతులు లేవు. మీరు సంతకం పెడితే రెండు వారాల్లో రూ.5 వేల కోట్లు తీసుకొస్తా" అని సవాల్ విసిరారు. స్టీల్ ప్లాంట్ అమ్మకం విషయమై అదానీ తనను కలిశారని కూడా పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పిల్ హైకోర్టులో కొట్టివేతకు గురికాలేదని, ఒకవేళ అలా జరిగినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు. "జగన్ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, చంద్రబాబు ఇంకా నా ఆశీస్సులు తీసుకోవడం లేదు" అని పాల్ వ్యాఖ్యానించారు.

KA Paul
Praja Shanti Party
Andhra Pradesh
Medical Colleges
PPP
Jagan Mohan Reddy
Chandrababu Naidu
Pawan Kalyan
Vizag Summit
Steel Plant

More Telugu News