Karnan: రేపు ఉదయం 8 గంటల నుంచి జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు: రిటర్నింగ్ ఆఫీసర్

Jubilee Hills Vote Counting at 8 AM Tomorrow Says Returning Officer
  • ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి
  • 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతితో 42 టేబుళ్లను ఏర్పాటు చేశామన్న ఆర్వో
  • 10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామ్న ఆర్వో కర్ణన్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని రిటర్నింగ్ ఆఫీసర్ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 11న ముగిసింది. రేపు (నవంబరు 14) ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్వో కర్ణన్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన అన్నారు. రేపు ఉదయం పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తామని వెల్లడించారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

10 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తామని ఆర్వో కర్ణన్ తెలియజేశారు. కౌంటింగ్ కోసం మొత్తం 186 మంది సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. ఫలితాలను ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, మీడియాకు ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తామని అన్నారు.

ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నగర జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామని అన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి ఉన్న వారు లెక్కింపు కేంద్రాల వద్దకు రావాలని సూచించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Karnan
Jubilee Hills
Jubilee Hills Election Result
Telangana Elections
Telangana Politics

More Telugu News