Chandrababu Naidu: రాష్ట్రం నుంచి వెళ్లిన పరిశ్రమలు వెనక్కి.. భాగస్వామ్య సదస్సు కంటే ముందే పెద్ద మొత్తంలో ఎంవోయూలు

Chandrababu Naidu Secures Massive Investment Deals for Andhra Pradesh
  • గత ప్రభుత్వంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత
  • మంత్రి లోకేశ్ ప్రకటించినట్లు ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ భారీ పెట్టుబడి
  • విశాఖలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రెన్యూ పవర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెన్యూ పవర్ సంస్థతో రూ. 82 వేల కోట్ల మేర ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఈ అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఒప్పందంలో భాగంగా ఈడీబీతో రూ. 60 వేల కోట్ల విలువైన నాలుగు ఎంవోయూలను రెన్యూ పవర్ సంస్థ కుదుర్చుకుంది. ఏపీలో రూ. 22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గతంలోనే రెన్యూ పవర్ సంస్థ ముందుకు వచ్చింది.

దీంతో మొత్తం ఒప్పందాల విలువ రూ. 82 వేల కోట్లకు చేరుకుంది. ఏపీలో పునరుత్పాదక శక్తి, సోలార్ తయారీ, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ హైడ్రో, గ్రీన్ అమ్మోనియా రంగాల్లో రెన్యూ పవర్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. ఒప్పందంలో భాగంగా 6 గిగావాట్ల పీవీ ఇం‌గోట్-వేఫర్ ప్లాంట్, 2 గిగావాట్ల పంప్డ్ హైడ్రో ప్రాజెక్ట్, 300 కేటీపీఏ గ్రీన్ అమ్మోనియా సౌకర్యం, విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ వంటి వాటిల్లో 5 గిగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టులను రెన్యూ పవర్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

తాజా ఎంఓయూల ద్వారా 10 వేలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే దేశంలోని అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ప్రాజెక్టును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసేందుకు రెన్యూ పవర్ అంగీకరించింది. గత ప్రభుత్వంలో రాష్ట్రం వీడి వెళ్లిన కంపెనీలు తిరిగి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్ నిన్న ట్వీట్ చేశారు. నేడు విశాఖలో సీఐఐ సమ్మిట్‌కు ముందే రెన్యూ పవర్ సంస్థతో భారీ మొత్తంలో ఒప్పందాలు కుదిరాయి.
Chandrababu Naidu
Andhra Pradesh
Renew Power
AP Investments
Nara Lokesh

More Telugu News