Mahesh Kumar Goud: రేవంత్‌రెడ్డితో గ్యాప్ లేదు.. మంత్రి పదవిపై ఆరాటపడట్లేదు: మహేశ్ గౌడ్

Mahesh Kumar Goud says no gap with Revanth Reddy not vying for minister post
  • మంత్రి పదవి కోసం తానెప్పుడూ అడగలేదన్న పీసీసీ అధ్యక్షుడు  
  • మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని ధీమా 
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు తమదేనన్న మహేశ్  
  • డీసీసీ అధ్యక్షుల నియామకంపై త్వరలో ప్రకటన ఉంటుందని వెల్లడి 
  • బీసీ రిజర్వేషన్లను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపణ 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తామిద్దరం పూర్తి సమన్వయంతోనే పనిచేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి పదవిపై తాను ఆరాటపడటం లేదని, పీసీసీ అధ్యక్షుడిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని, మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం తమకు కలిసి వచ్చిందన్నారు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదని కొట్టిపారేశారు. పోలింగ్ శాతం మరికొంత పెరిగి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ బాగా పెరిగిందని, మరో పదేళ్ల పాటు తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని మహేశ్ గౌడ్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. క్యాబినెట్ విస్తరణ అంశం పూర్తిగా అధిష్ఠానం, సీఎం రేవంత్ రెడ్డి చూసుకుంటారని తెలిపారు.

డీసీసీ అధ్యక్షుల నియామకంపై పార్టీ అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసిందని, ఏ క్షణంలోనైనా జాబితా వెలువడవచ్చని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు ఆదేశాల ప్రకారమే నిర్వహిస్తామని చెప్పారు. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డుపడుతోందని ఆయన ఆరోపించారు. అలాగే, బిహార్ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ కూటమి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.
Mahesh Kumar Goud
Revanth Reddy
TPCC
Telangana Congress
Jubilee Hills by-election
DCC presidents
BC reservations
Telangana politics
Congress party
Naveen Yadav

More Telugu News