Delhi Blast Case: ఎర్రకోట పేలుళ్ల కేసు: డీఎన్‌ఏ టెస్టులో నిర్ధారణ

DNA confirms Dr Umar drove explosive laden car in Delhi blast
  • ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో వీడిన మిస్టరీ
  • డీఎన్‌ఏ పరీక్షలో వెల్లడైన కీలక నిజాలు
  • పేలుడు జరిగిన కారు నడిపింది డాక్టర్ ఉమర్ మహమ్మద్
  • ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్‌ యూనివర్సిటీలో సీనియర్ డాక్టర్‌గా గుర్తింపు
  • ఢిల్లీ పోలీసుల నుంచి కేసును స్వీకరించిన ఎన్ఐఏ
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసులో దర్యాప్తు అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ నెల 10న జరిగిన ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. పేలుడుకు గురైన ఐ20 కారును నడిపింది ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్‌ యూనివర్సిటీలో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్న ఉమర్ మహమ్మద్ అని దర్యాప్తులో తేలింది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా ఈ విషయాన్ని అధికారులు నిర్ధారించారు.

ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పేలుడు జరిగిన కారులో లభించిన ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఆ నమూనాలను ఉమర్ తల్లి, సోదరుడి డీఎన్‌ఏతో పోల్చి చూడగా, 100 శాతం సరిపోలాయి. దీంతో పేలుడు సమయంలో కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ మహమ్మద్‌ అనే విషయం నిర్ధారణ అయింది. 

ఈ నెల 10న‌ సాయంత్రం 6:52 గంటల సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. దేశంలోనే అత్యంత కీలకమైన, అధిక భద్రత ఉండే ఎర్రకోట సమీపంలో ఈ ఘటన జరగడంతో రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారికంగా స్వీకరించింది. ఎన్ఐఏ అధికారులు సంఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకుని, పేలుడు పదార్థాల అవశేషాలు, వాహన భాగాలపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రాథమిక విచారణలో కారులో అత్యంత శక్తిమంతమైన ఐఈడీలను అమర్చినట్లు తేలింది. ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి సమకూర్చారు? పేలుడుకు ముందు రోజుల్లో ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడు? అనే వివరాలపై అధికారులు దృష్టి సారించారు. ఘటన జరిగిన రోజు ఉదయం ఉమర్.. ఢిల్లీలో వ్యక్తిగత పని ఉందని సహోద్యోగులకు చెప్పి ఫరీదాబాద్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరినట్లు తెలిసింది. అతను ఒంటరిగానే ఈ దాడికి పాల్పడ్డాడా? లేక దీని వెనుక ఏదైనా పెద్ద నెట్‌వర్క్ ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

కాగా, ఎర్రకోటలో పేలుడు జరిగిన రోజే హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నివాస భవనాల నుంచి జమ్మూకశ్మీర్ పోలీసులు సుమారు 3,000 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.
Delhi Blast Case
Umar Muhammad
Red Fort blast
Faridabad
Al Falah University
DNA test
IED
NIA investigation
Terrorism
Car bomb

More Telugu News