Telangana Weather: తెలంగాణ గజగజ .. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!

Telangana Shivers Orange Alert Issued for Several Districts
  • తెలంగాణను వణికిస్తున్న చలి గాలులు
  • రానున్న రోజుల్లో మరింత పెరగనున్న తీవ్రత
  • పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్
  • శ్వాసకోశ సమస్యలతో పెరుగుతున్న రోగుల సంఖ్య
  • చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యుల సూచన
  • ఆసిఫాబాద్ జిల్లాలో 10.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత బాగా పెరిగింది. కొన్ని రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలంగాణ గజగజ వణుకుతోంది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో చలి మరింత తీవ్రం కానుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జారీ చేసింది.

వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం రానున్న రోజుల్లో రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు 8.5 డిగ్రీల నుంచి 12.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని తెలిపింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు చలికి వణికిపోతున్నాయి. మంగళవారం రాత్రి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో అత్యల్పంగా 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలు
ఈ చలి వాతావరణం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన చలి కారణంగా హైపోథెర్మియా (శరీర ఉష్ణోగ్రత పడిపోవడం), ఫ్రాస్ట్‌బైట్ (చర్మ కణజాలం గడ్డకట్టడం) వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయన్నారు. చల్లని వాతావరణంలో రోగ నిరోధక శక్తి మందగించడం వల్ల వైరస్‌లు సులభంగా వ్యాప్తి చెందుతాయని, దీనివల్ల న్యూమోనియా, ఇతర శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని వివరిస్తున్నారు. ఇప్పటికే జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పితో ఆసుపత్రులకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. ఆస్తమా, సీవోపీడీ వంటి దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారిలో లక్షణాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని, చర్మం పొడిబారడం, పగలడం వంటి సమస్యలు కూడా అధికమవుతాయని తెలిపారు.

వీరికి మరింత అప్రమత్తత అవసరం
చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున కొన్ని వర్గాల వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులతో పాటు ఆరుబయట పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. శరీరాన్ని వెచ్చగా ఉంచే దుస్తులు ధరించడం, గోరువెచ్చని నీరు తాగడం, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌లు వేసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు. ఆస్తమా రోగులు తమ ఇన్‌హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రం తీవ్ర చలి ప్రభావిత (కోర్‌ కోల్డ్‌ వేవ్‌) జోన్‌లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఎన్‌పీసీసీహెచ్‌హెచ్ గత ఏడాదే ప్రకటించిన విషయాన్ని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈసారి కూడా అదే తరహా పరిస్థితి నెలకొనడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని సూచిస్తున్నారు.
Telangana Weather
Telangana
Hyderabad weather
cold wave
orange alert
yellow alert
weather forecast
IMD
winter health advisory
hypothermia

More Telugu News