Madanapalle: మదనపల్లెలో కిడ్నీ రాకెట్.. ఆపరేషన్ వికటించి మహిళ మృతి

Madanapalle Kidney Racket Woman Dies After Illegal Operation
  • మదనపల్లెలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్
  • డబ్బు ఆశ చూపి విశాఖ మహిళకు ఆపరేషన్
  • శస్త్రచికిత్స వికటించి బాధితురాలు మృతి
  • ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • నిందితుల్లో ప్రభుత్వ ఆసుప‌త్రుల జిల్లా కోఆర్డినేటర్
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో భారీ కిడ్నీ రాకెట్ వెలుగుచూసింది. డబ్బు ఆశ చూపి ఓ నిరుపేద మహిళకు కిడ్నీ ఆపరేషన్ చేయగా, అది వికటించి ఆమె మృతి చెందింది. ఈ ఘటనతో అక్రమ కిడ్నీ దందా గుట్టు రట్టయింది. ఈ కేసులో ఓ ప్రైవేటు ఆసుప‌త్రి అధినేతతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె టూటౌన్ సీఐ రాజారెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు ప్రభుత్వ ఆసుప‌త్రుల జిల్లా సమన్వయకర్త (DCHS) కావడం కలకలం రేపుతోంది.

విశాఖ జిల్లా అనంతపురం మండలం బొడ్డుపాళేనికి చెందిన ఎస్. యమున(29) ఎనిమిదేళ్ల క్రితం భర్తను కోల్పోయింది. అప్పటి నుంచి ఓ దుకాణంలో పనిచేస్తూ తన తొమ్మిదేళ్ల కుమారుడిని పోషించుకుంటోంది. ఆమె ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న గాజువాకకు చెందిన పద్మ, సత్య అనే ఇద్దరు వ్యక్తులు.. కిడ్నీ ఇస్తే పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపారు. వీరిలో ఒకరు మదనపల్లె ప్రభుత్వ ఆసుప‌త్రిలో, మరొకరు కదిరి ఆసుప‌త్రిలోని డయాలసిస్ కేంద్రంలో టెక్నీషియన్లుగా పనిచేస్తున్నారు.

యమునతో పరిచయం ఉన్న సూరిబాబు అనే వ్యక్తి సాయంతో పద్మ, సత్య ఆమెను మదనపల్లెకు తీసుకొచ్చారు. అక్కడ స్థానికంగా ఉండే బాలరంగడు, మెహరాజ్‌ల ద్వారా ఆదివారం మదనపల్లెలోని గ్లోబల్ ఆసుప‌త్రిలో చేర్పించారు. అదేరోజు వైద్యులు యమునకు కిడ్నీ ఆపరేషన్ నిర్వహించగా, సోమవారం ఆమె ప్రాణాలు కోల్పోయింది. 

ఈ ఘటనతో భయపడిపోయిన సూరిబాబు, యమున మృతదేహాన్ని తిరుపతికి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి విశాఖలో ఉన్న మృతురాలి తల్లి సూరమ్మకు ఫోన్ చేసి, కిడ్నీ ఆపరేషన్ తర్వాత యమున మృతిచెందినట్లు చెప్పాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె, "నా కుమార్తెను నువ్వే తీసుకెళ్లి చంపేశావు" అని నిలదీసింది. భయంతో వణికిపోయిన సూరిబాబు వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు మదనపల్లె పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం నిందితులను పట్టుకుని, గ్లోబల్ ఆసుప‌త్రి అధినేత, అన్నమయ్య జిల్లా డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ఆంజనేయులును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పిక్నిక్ అని చెప్పి తీసుకెళ్లారు
మరోవైపు మదనపల్లె టూటౌన్ పోలీస్ స్టేషన్ వద్ద మృతురాలి తల్లి సూరమ్మ కన్నీరుమున్నీరయ్యారు. "నా కుమార్తెను పిక్నిక్ పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొచ్చి కిడ్నీ ముఠాకు బలిచేశారు" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సూరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.


Madanapalle
Yamuna
Kidney racket
Kidney transplant
Organ trafficking
Andhra Pradesh
Global Hospital
DCHS
Illegal surgery
Kidney donation

More Telugu News