Ahmad al-Shara: సిరియా అధ్యక్షుడితో ట్రంప్ పరాచికాలు మామూలుగా లేవు!

Trump Jokes With Syrian President al Shara About Wives
  • మీకు ఎంతమంది భార్యలని సిరియా అధ్యక్షుడిని ప్రశ్నించిన ట్రంప్
  • అల్-షరాకు పెర్ఫ్యూమ్ బహుమతిగా అందజేసిన ట్రంప్ 
  • ఇరువురి సంభాషణల వీడియో సోషల్ మీడియాలో వైరల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, సిరియా నూతన అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ భేటీ సందర్భంగా ట్రంప్, అల్-షరాకు ఒక పెర్ఫ్యూమ్ బాటిల్‌ను బహుమతిగా అందించారు. ఇది మంచి సువాసన వెదజల్లుతుందని, మీకు మీ సతీమణికి బాగుంటుందని చెప్పారు. అదే సమయంలో, "మీకు ఎంత మంది భార్యలు?" అని అల్-షరాను ట్రంప్ ప్రశ్నించారు. 

దీనికి సిరియా అధ్యక్షుడు "ఒక్కరే" అని సమాధానం ఇవ్వగా.. ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, "అది నిజమా? నమ్మలేకపోతున్నా" అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఒకప్పటి ఖైదీ.. నేడు అధ్యక్షుడు

ఈ పర్యటన ద్వారా అహ్మద్ అల్-షరా ఒక అరుదైన రికార్డును సృష్టించారు. 1946లో సిరియాకు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత వాషింగ్టన్‌లో పర్యటించిన మొట్టమొదటి సిరియా అధ్యక్షుడిగా ఆయన నిలిచారు. అయితే, అంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రెండు దశాబ్దాల క్రితం ఆయన అమెరికా నిర్బంధ కేంద్రంలోనే ఖైదీగా ఉన్నారు.

2003లో ఇరాక్‌పై అమెరికా దండయాత్రకు ముందు అల్-ఖైదాలో చేరిన అల్-షరా, ఇరాకీ తిరుగుబాటులో పాల్గొన్నారు. ఈ కారణంగా అమెరికా దళాలు ఆయనను 2006 నుంచి 2011 వరకు నిర్బంధంలో ఉంచాయి. విడుదలైన తర్వాత సిరియాకు చేరుకుని, అక్కడ అల్-ఖైదా అనుబంధ సంస్థ అయిన 'అల్ నుస్రా ఫ్రంట్‌'ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఇడ్లిబ్ వంటి ప్రాంతాల్లో బలీయమైన శక్తిగా ఎదిగారు.

కాలక్రమేణా అల్-ఖైదా నుంచి దూరం జరిగి, వేలాది మంది తిరుగుబాటుదారులతో కలిసి 2017లో ‘హయాత్‌ తహరీర్‌ అల్‌-షమ్‌’ (హెచ్‌టీఎస్‌)ను స్థాపించారు. గతేడాది డిసెంబర్‌లో అల్-షరా నాయకత్వంలోని దళాలు, సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. ఒకప్పుడు తమ దేశానికి వ్యతిరేకంగా పోరాడి, తమ నిర్బంధంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడు ఒక దేశాధినేత హోదాలో అమెరికా అధ్యక్షుడితో భేటీ కావడం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ahmad al-Shara
Syria president
Donald Trump
Syria US relations
al-Qaeda
Hayat Tahrir al-Sham
HTS
Idlib Syria
Bashar al-Assad
Syria war

More Telugu News