Hidma: ఇప్పటికైనా ఇంటికిరా కొడుకా: మావోయిస్టు హిడ్మాకు తల్లి కన్నీటి పిలుపు

Maoist Leader Hidma Mother Appeals for His Return Home
  • మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు తల్లి కన్నీటి విజ్ఞప్తి
  • ఇంటికి వచ్చి సాధారణ జీవితం గడపాలని వీడియో సందేశం
  • గోండు భాషలో రికార్డు చేసిన ఈ వీడియోను విడుదల చేసిన పోలీసులు
  • ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి సూచనతో ఈ పరిణామం
  • మరో మావోయిస్టు నేత దేవా తల్లితోనూ ఇదే తరహా వీడియో
  • అన్నదమ్ములైన హిడ్మా, దేవా లొంగుబాటు కోసం పోలీసుల ప్రయత్నాలు
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ నేత మాద్వి హిడ్మా లొంగుబాటు కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అతని తల్లి ద్వారానే ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ‘బిడ్డా, ఇప్పటికైనా ఇంటికి తిరిగిరా.. లేదంటే నీకోసం నేనే అడవిబాట పడతా’ అంటూ హిడ్మా తల్లి కన్నీళ్లతో వేడుకుంటున్న ఓ వీడియో సందేశాన్ని పోలీసులు మంగళవారం విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో హిడ్మా తల్లి తమ స్థానిక గోండు భాషలో మాట్లాడారు. ‘‘కొడుకా, ఇంటికి వచ్చి అందరిలా సాధారణ జీవితం గడుపు. నీ కోసం కుటుంబ సభ్యులమంతా ఎదురుచూస్తున్నాం. నువ్వు రాకపోతే నిన్ను వెతుక్కుంటూ నేనే అడవిలోకి వస్తాను’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయశర్మ స్వయంగా హిడ్మా తల్లిని కలిసి, కుమారుడిని జనజీవన స్రవంతిలోకి వచ్చేలా ఒప్పించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ భేటీ తర్వాతే పోలీసులు ఈ వీడియోను రికార్డు చేసి విడుదల చేయడం గమనార్హం.

ఇదే తరహాలో మరో మావోయిస్టు కీలక నేత దేవా తల్లితో కూడా పోలీసులు మరో వీడియోను విడుదల చేశారు. పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా, దేవా వరసకు అన్నదమ్ములు. దండకారణ్యంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనలకు వీరిద్దరూ కీలక వ్యూహకర్తలుగా వ్యవహరించారని పోలీసుల రికార్డుల్లో ఉంది. కుటుంబ సభ్యుల ద్వారా మానసికంగా ఒత్తిడి పెంచి, వారిని లొంగిపోయేలా చేయాలన్నది పోలీసుల వ్యూహంగా కనిపిస్తోంది.

Hidma
Madvi Hidma
Chhattisgarh
Maoist
Surrender
Naxal
Naxalite
Chhattisgarh Police
Gondi Language
Deva

More Telugu News