Sri Lanka Cricket Team: పాక్‌లో మళ్లీ ఉగ్ర కలకలం.. శ్రీలంక జట్టుకు హై సెక్యూరిటీ.. రంగంలోకి ఆర్మీ

Sri Lanka Cricket Team Security Increased in Pakistan After Terrorist Threats
  • పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు భద్రత పెంపు
  • ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం
  • జట్టుకు పూర్తి భద్రత కల్పిస్తామన్న పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ
  • భద్రతా విధుల్లో పాక్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లు
  • లంక ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి భరోసా ఇచ్చిన మంత్రి
పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుకు భద్రతను భారీగా పెంచారు. దేశంలో ఇటీవల వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఆటగాళ్ల భద్రతను పర్యవేక్షించేందుకు పాకిస్థాన్ ఆర్మీ, పారామిలటరీ రేంజర్లను సైతం రంగంలోకి దించింది.

పీసీబీ ఛైర్మన్‌గా, దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న మొహ్సిన్ నఖ్వీ.. శ్రీలంక జట్టు సభ్యులను స్వయంగా కలిసి వారికి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. "మీ భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం" అని ఆయన శ్రీలంక ఆటగాళ్లకు భరోసా ఇచ్చారు.

నిన్న‌ ఇస్లామాబాద్‌లోని ఓ జ్యుడీషియల్ కాంప్లెక్స్ వెలుపల జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతిచెంద‌గా, పలువురు గాయపడ్డారు. అదే సమయంలో ఉత్తర పాకిస్థాన్‌లోని వానా ప్రాంతంలో ఉన్న కేడెట్ కాలేజీపై ఉగ్రవాదులు దాడికి యత్నించగా, భద్రతా దళాలు దానిని విఫలం చేసి 300 మంది విద్యార్థులను సురక్షితంగా తరలించాయి. భద్రతా దళాలు వేగంగా స్పందించకపోయి ఉంటే పెషావర్‌ పాఠశాలపై జరిగిన దాడి వంటి మరో ఘోర విషాదం జరిగి ఉండేదని సమాచార శాఖ మంత్రి అతా తరార్ అన్నారు. పాకిస్థాన్‌లో దాడులకు తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ భూభాగాన్ని వాడుకుంటున్నారని పాక్ పరోక్షంగా ఆరోపించింది.

2009లో లంక జట్టు బస్సుపై దాడి
2009 మార్చిలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో శ్రీలంక జట్టు బస్సుపై టీటీపీ ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ భయానక ఘటన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ నిలిచిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు అంతర్జాతీయ జట్లు వస్తున్న తరుణంలో భద్రతా సమస్యలు తలెత్తకుండా పీసీబీ జాగ్రత్తలు తీసుకుంటోంది. మూడేళ్ల క్రితం కూడా ఉగ్రదాడి జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో న్యూజిలాండ్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే పర్యటనను రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లింది.

ప్రస్తుత పర్యటనలో భాగంగా శ్రీలంక జట్టు రావల్పిండిలో మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం నవంబర్ 17 నుంచి 29 వరకు జింబాబ్వేతో కలిసి టీ20 ట్రై సిరీస్‌లో పాల్గొంటుంది.
Sri Lanka Cricket Team
Pakistan
Terrorist Attack
Security
PCB
Mohsin Naqvi
Tehrik-i-Taliban Pakistan
TTP
Cricket
Rawalpindi

More Telugu News