Chandrababu Naidu: గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Slams Previous Government on Housing Sector in Andhra Pradesh
  • అన్నమయ్య జిల్లా రాయచోటిలో 'ప్రజావేదిక' కార్యక్రమం
  • 2029 నాటికి పేదలందరికీ సొంతింటి కలను సాకారం చేస్తామని వెల్లడి 
  • గృహ నిర్మాణానికి ముస్లింలకు రూ.50 వేల అదనపు సాయం ప్రకటన
  • గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ.900 కోట్ల బిల్లులను చెల్లిస్తామని హామీ
  • ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుతో మహిళలకు ప్రోత్సాహం
  • ఉగాది నాటికి రాష్ట్రవ్యాప్తంగా మరో 5.9 లక్షల ఇళ్లలో గృహప్రవేశాలు
  • ఇంటింటికీ సోలార్ విద్యుత్, ఇంటర్నెట్ అందిస్తామన్న ముఖ్యమంత్రి
రాష్ట్రంలో 2029 నాటికి ఇల్లు లేని నిరుపేద అనేవారే ఉండకూడదని, ప్రతి ఒక్కరికీ సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, అదొక గౌరవం, భద్రత, భవిష్యత్తుకు చిరునామా అని ఆయన అభివర్ణించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించిన అనంతరం ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన కీలక ప్రకటనలు చేశారు.

గత పాలనపై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్ల పాలనలో గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. పేదలకు ఇళ్లు కట్టిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేకపోగా, కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆరోపించారు. "తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు పక్కా ఇళ్లు కట్టించలేదు. గుడిసెలు గాలొస్తే కొట్టుకుపోయేవి. కానీ పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని ఆలోచించిన మహానుభావుడు ఎన్టీఆర్. కూడు, గూడు, గుడ్డ నినాదంతోనే టీడీపీ పుట్టింది. మేం 2014-19 మధ్య 8 లక్షల ఇళ్లు కట్టిస్తే, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.73 లక్షల ఇళ్లను రద్దు చేసింది. సొంతంగా ఇల్లు కట్టుకున్న 2.73 లక్షల మందికి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు ఎగ్గొట్టారు. ఆ బకాయిలను మా ప్రభుత్వం చెల్లిస్తుంది" అని హామీ ఇచ్చారు.

పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు తాము ఇస్తే, గత పాలకులు పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలం ఇచ్చి చేతులు దులుపుకున్నారని, అవి కూడా ఊరికి దూరంగా కొండలు, గుట్టల్లో ఇచ్చి చదును పేరుతో కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. పేదలకు ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకను కూడా పందికొక్కుల్లా తిన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి ఇంటి నుంచి పారిశ్రామికవేత్త రావాలి

ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. "ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలి. నిన్న కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గంలోనూ వీటిని ఏర్పాటు చేసి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు రూ.50 వేల కోట్లు రుణాలు తీసుకుని బాధ్యతగా చెల్లిస్తున్నారు. దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు. వారికి అన్ని విధాలా శిక్షణ ఇప్పించి వ్యాపారవేత్తలుగా మారుస్తాం" అని భరోసా ఇచ్చారు.

ముస్లింలకు అదనపు సాయం.. కీలక ప్రకటనలు

గృహ నిర్మాణ లబ్ధిదారులకు చంద్రబాబు పలు వరాలు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో రూ.2.5 లక్షలు, గ్రామాల్లో రూ.2 లక్షలు ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ, ఎస్సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అదనంగా ఇస్తున్నామని గుర్తుచేశారు. ఇకపై బీసీలు, ఎస్సీలతో సమానంగా ముస్లిం మైనారిటీలకు కూడా గృహ నిర్మాణానికి రూ.50 వేలు అదనంగా అందిస్తామని ప్రకటించారు. దీనివల్ల ఆర్థిక స్థోమత లేక ఇళ్ల నిర్మాణాలు నిలిపివేసిన దాదాపు 6 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, ప్రభుత్వానికి రూ.3,220 కోట్ల భారం పడుతుందని వివరించారు.

ఆధునిక సౌకర్యాలతో ఇళ్లు.. భవిష్యత్ ప్రణాళిక

భవిష్యత్తులో నిర్మించే ఇళ్లను ఆధునిక సౌకర్యాలతో అందిస్తామని చంద్రబాబు తెలిపారు. "ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా, బీసీలకు సబ్సిడీపై సోలార్ ప్యానెళ్లు అందిస్తాం. దీనివల్ల విద్యుత్ వినియోగదారులే ఉత్పత్తిదారులుగా మారతారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాం. నా తల్లి పడ్డ కష్టాలు చూసే దీపం పథకం పెట్టాను. ఇప్పుడు 'దీపం 2.0' కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం" అని పేర్కొన్నారు. 

జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామని, పులివెందులతో సహా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు. ఉగాది నాటికి మరో 5.9 లక్షల గృహప్రవేశాలు చేయిస్తామని, ఇల్లు లేని అర్హులందరినీ గుర్తించి స్థలాలు కేటాయిస్తామని తెలిపారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహిస్తామని, పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh Housing
AP Housing Scheme
NTR Housing
AP Government Schemes
Rayachoti
Jagan Mohan Reddy
Dwacra women
Solar Power Andhra Pradesh
AP Elections 2024

More Telugu News