Peddireddy Ramachandra Reddy: డబ్బు కోసమే చంద్రబాబు కుట్ర.. మెడికల్ కాలేజీల భూములు రూ.100కే అమ్మకం: పెద్దిరెడ్డి

Chandrababu Involved in Conspiracy for Money Peddireddy Allegation
  • సీఎం చంద్రబాబుపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు
  • లక్షల కోట్ల విలువైన మెడికల్ కాలేజీ భూములను కట్టబెడుతున్నారని విమర్శ
  • పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీ
  • ప్రైవేటీకరణతో 2150 మెడికల్ సీట్లు కోల్పోతామని ఆవేదన
  • డబ్బు ఆశతోనే చంద్రబాబు కుటుంబం కుట్ర చేస్తోందని ఆరోపణ
ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని, లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం వంద రూపాయలకే కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.

చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "50 ఎకరాల మెడికల్ కాలేజీ భూముల ద్వారా రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. పేద విద్యార్థులు డాక్టర్లు అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. కానీ, కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వల్ల రాష్ట్రం సుమారు 2150 మెడికల్ సీట్లను కోల్పోతుంది" అని ఆవేదన వ్యక్తం చేశారు.

పులివెందులలో 50 సీట్లతో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయినా, చంద్రబాబు అడ్డుపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాశారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. గతంలో వైఎస్ జగన్ ‘నాడు–నేడు’ కింద ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు అవన్నీ మూలన పడ్డాయని అన్నారు.

"రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటైతే ఏటా 4500 సీట్లు అదనంగా వస్తాయి. ఐదేళ్లలో 30 నుంచి 40 వేల మంది వైద్య విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది. ఇంతటి ప్రయోజనాన్ని దెబ్బతీస్తూ, కేవలం డబ్బు ఆశతోనే చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు" అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.
Peddireddy Ramachandra Reddy
Chandrababu
Andhra Pradesh
Medical Colleges
Privatization
Land Scam
YSRCP
Punganur
National Medical Council

More Telugu News