Shobhita Dhulipala: వివాదాస్పద సినిమాపై అక్కినేని కోడలు శోభిత ప్రశంసలు.. అమ్మాయిలు చూడాలంటూ సూచన

Shobhita Dhulipala Praises Controversial Movie Bad Girl
  • ఓటీటీలోకి వచ్చిన 'బ్యాడ్ గర్ల్
  • వెట్రిమారన్ నిర్మాణంలో వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్
  • గతంలో సెన్సార్ వివాదాలతో వార్తల్లో నిలిచిన సినిమా
  • ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'బ్యాడ్ గర్ల్'
  • శోభిత పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన
టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య భార్య, నటి శోభిత ధూళిపాళ ఇటీవల ఓటీటీలో విడుదలైన ఓ వివాదాస్పద తమిళ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూసి తాను ఎంతో చలించిపోయానని, ముఖ్యంగా అమ్మాయిలందరూ తప్పకుండా చూడాలని కోరుతూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో 'బ్యాడ్ గర్ల్' అనే చిత్రం తెరకెక్కింది. వర్ష భరత్ కుమార్ ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయమయ్యారు. సామాజిక కట్టుబాట్ల మధ్య స్వేచ్ఛగా జీవించాలని ఆరాటపడే ఓ మధ్యతరగతి యువతి కథగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

 అయితే, టీజర్ విడుదల సమయంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సెన్సార్ బోర్డు సినిమా విడుదలను నిలిపివేయడంతో ఇది వివాదాస్పదంగా మారింది. అనేక అడ్డంకులను దాటుకుని సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను వీక్షించిన శోభిత ధూళిపాళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, "బ్యాడ్ గర్ల్.. నన్ను నవ్వించింది.. ఏడిపించింది. మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మనకోసం తీసిన చిత్రం. వర్ష భరత్, అంజలి శివరామన్‌ను అభినందించాలి" అని రాసుకొచ్చారు.

శోభిత పోస్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆమె అభిప్రాయాన్ని సమర్థిస్తూ సినిమాపై ఆసక్తి చూపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇటీవల వచ్చిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా గురించి ఎందుకు స్పందించ లేదంటూ ప్రశ్నిస్తున్నారు.
Shobhita Dhulipala
Bad Girl Movie
Tamil Movie
OTT Release
Controversial Movie
Varsha Bharath Kumar
Anjali Sivaraman
Naga Chaitanya
Tollywood

More Telugu News