Kantha Movie: 'కాంత' చిత్రంపై ఆసక్తికర ప్రచారం.. ఎవరీ త్యాగరాజ భాగవతార్?

Kantha Movie Is Dulquer Playing Thyagaraja Bhagavathar
  • దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'కాంత'
  • ఈ నెల‌ 14న ప్రేక్షకుల ముందుకు సినిమా 
  • తొలి ఇండియన్ సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ బయోపిక్ అనే ప్రచారం
  • హత్య కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లిన నటుడి కథ
  • విడుదలకు ముందు సినిమాపై పెరిగిన ఆసక్తి
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'కాంత'. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల‌ 14న విడుదల కానుంది. అయితే, విడుదలకు కొన్ని రోజుల ముందు ఈ చిత్రంపై ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. 'కాంత' సినిమా, ఒకప్పటి లెజెండరీ తమిళ నటుడు, తొలి ఇండియన్ సూపర్ స్టార్‌గా పేరుగాంచిన ఎంకే త్యాగరాజ భాగవతార్ (MKT) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎవరీ త్యాగరాజ భాగవతార్?
ఈ తరం ప్రేక్షకులకు ఎంకే త్యాగరాజ భాగవతార్ గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఆయన భారతీయ సినిమాకు తొలి సూపర్ స్టార్. ఆయన నటించిన 14 చిత్రాలలో 10 సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'హరిదాసు' అనే చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అపారమైన కీర్తి, సంపదతో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన ఆయన కెరీర్, ఒక వివాదంతో తలకిందులైంది.

వివాదాలు.. జైలు జీవితం
ఓ ప్రముఖ దర్శకుడితో వివాదం ఎంకేటీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ తర్వాత జరిగిన ఒక జర్నలిస్ట్ హత్య కేసులో ఆయనను ఇరికించడంతో రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకప్పుడు వైభవాన్ని చూసిన ఆయన, చివరి రోజుల్లో అనారోగ్యంతో బాధపడుతూ కేవలం 49 ఏళ్లకే కన్నుమూశారు.

ఇప్పుడు ఇదే విషాదభరిత కథను 'కాంత' పేరుతో తెరకెక్కించారని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్.. ఎంకే త్యాగరాజ భాగవతార్ పాత్రను పోషిస్తుండగా, ఆయన పతనానికి కారణమైన దర్శకుడి పాత్రలో సముద్రఖని నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, ఈ బయోపిక్ ప్రచారంతో 'కాంత'పై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
Kantha Movie
Dulquer Salmaan
MK Thyagaraja Bhagavathar
Thyagaraja Bhagavathar biopic
Samuthirakani
Tamil actor
Indian superstar
Haridasu movie
Selvamani Selvaraj
Kollywood news

More Telugu News