Maganti Sunitha: జూబ్లీహిల్స్‌లో పోలీసుల తీరుపై మాగంటి సునీత ఫైర్.. 14న చూసుకుందామంటూ వార్నింగ్‌!

Maganti Sunitha Fires at Police in Jubilee Hills Warns of Action After 14th
  • పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న సునీత‌
  • కాంగ్రెస్ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపణ
  • త‌న‌ను అడ్డుకోవడానికి మీరెవరంటూ పోలీసులపై సునీత ఆగ్రహం
  • 14వ తేదీ తర్వాత చూసుకుందామని పోలీసులకు హెచ్చరిక
  • ఆశా వర్కర్లను ఉద్యోగాల పేరుతో బెదిరిస్తున్నారని విమర్శ
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరబండలోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన తనను పోలీసులు అడ్డుకున్నారని సునీత ఆరోపించారు. "ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఏంటి?" అంటూ తనను బలవంతంగా వెనక్కి పంపారని, ఇది పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, గూండాలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని సునీత విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. బోరబండలో ఓ రౌడీ షీటర్ ప్రజలను బెదిరిస్తున్నా పోలీసులు అతనికి సహకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తమకు ఓటు వేయకపోతే ఉద్యోగాలు తీసేస్తామని ఆశా వర్కర్లను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎన్నికల కోడ్ ఉల్లంఘించి భారీ కాన్వాయ్‌తో సిద్దార్థ నగర్‌లోని బూత్-120 వద్ద పర్యటించారని, దీనిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె నిలదీశారు. నిబంధనల ప్రకారం అందరూ పనిచేయాలని సూచించారు. "13వ తేదీ వరకు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి. 14వ తేదీ తర్వాత చూసుకుందాం" అని పోలీసులకు ఆమె గట్టిగా హెచ్చరించారు. ఈ పరిణామాలతో జూబ్లీహిల్స్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Maganti Sunitha
Jubilee Hills
BRS
Telangana Elections
Police
Congress Party
Bhatti Vikramarka
Election Code Violation
Borabanda
Political Conflict

More Telugu News