Hijras: కొత్త ఇల్లు కడితే రూ.లక్ష ఇవ్వాలట.. అంత ఇవ్వలేనన్న వ్యక్తిపై హిజ్రాల దాడి

Hijras Attack Family Demanding Money for New House in Keesara
  • చీర్యాల్ లో ఓ కుటుంబంపై కర్రలు, రాళ్లతో దాడి చేసిన హిజ్రాలు
  • కొత్తగా కట్టుకున్న ఇంటి ఆవరణలో విధ్వంసం
  • అడిగినంతా ఇవ్వలేదని మూడు ఆటోల్లో వచ్చి మరీ దాష్ఠీకం
కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన ఓ కుటుంబంపై హిజ్రాలు దాడి చేశారు. రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేయగా అంత ఇవ్వలేనడంతో అసభ్యంగా దూషించారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన హిజ్రాలు.. ఆ తర్వాత మూడు ఆటోల్లో గుంపుగా వచ్చి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. కీసర మండలం చీర్యాల్ లో చోటుచేసుకుందీ దారుణం. వివరాల్లోకి వెళితే..

చీర్యాల్ లోని శ్రీబాలాజీ ఎన్క్లేవ్‌‌‌ లో‌‌‌‌‌ ప్రమిదల సదానందం ఇటీవల కొత్త ఇల్లు కట్టుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో సంతోషంగా గృహప్రవేశం నిర్వహించాడు. ఈ క్రమంలో ఆదివారం ఇంటిముందు సదానందం పనిచేస్తుండగా ఇద్దరు హిజ్రాలు వచ్చారు. కొత్త ఇల్లు కట్టుకున్నారు మాకు డబ్బులు ఇవ్వాలని అడిగారు. ఎంతోకొంత ఇచ్చి పంపిద్దామని చూస్తే ఒప్పుకోలేదు. రూ.లక్ష ఇవ్వాలని పట్టుబట్టారు. అంత మొత్తం ఇవ్వలేనని సదానదం చెప్పడంతో అసభ్యంగా దూషించి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత మూడు ఆటోల్లో 15 మంది హిజ్రాలు వచ్చారు. ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్దం విని బయటకు వచ్చిన సదానందంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఈ గొడవను గమనించి చుట్టుపక్కల వారు రావడంతో హిజ్రాలు పారిపోయారు. హిజ్రాల దాడిలో గాయపడ్డ సదానందం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాక కీసర పోలీస్‌ ‌‌‌‌‌‌‌స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాల ఆగడాలు హెచ్చుమీరుతున్నాయని, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Hijras
Keesara
Telangana
Extortion
Attack
New House
Housewarming
Chiryala
Crime
Police Complaint

More Telugu News