missing girls: అడవిలోకి పారిపోయిన బాలికలు.. 4 రోజులు గుహలో తలదాచుకున్న వైనం..!

Girls flee school hide in forest for 4 days in Alluri Sitarama Raju district
  • ఆశ్రమ పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థినులు
  • డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు
  • గుహలో బాలికలను గుర్తించి వెనక్కి తీసుకొచ్చిన అధికారులు
ఆశ్రమ పాఠశాల నుంచి ఇద్దరు బాలికలు అడవిలోకి పారిపోయారు. దుంపలు తింటూ, వాగులో నీరు తాగుతూ కొండ గుహలో తలదాచుకున్నారు. నాలుగు రోజుల పాటు అడవిలోనే ఉండిపోయారు. పాఠశాల నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడ పట్టి గుహలో విద్యార్థినులను గుర్తించారు. గ్రామస్థుల సహాయంతో వారిని వెనక్కి తీసుకొచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

జిల్లాలోని పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు పెదబయలు ఆశ్రమ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. ఐదు, ఆరో తరగతి చదువుతున్న ఈ బాలికలు చదువులో వెనకబడ్డారు. దీంతో ఈ నెల 6న వీరిద్దరూ సమీపంలోని అడవిలోకి పారిపోయారు. కారడవిలో దుంపలు తింటూ వాగులో నీరు తాగుతూ నాలుగు రోజుల పాటు గుహలో దాక్కున్నారు. బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన పాఠశాల సిబ్బంది.. చుట్టుపక్కల వెదికారు.

బాలికల ఆచూకీ దొరకకపోవడంతో ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి బాలికల కోసం గాలింపు చేపట్టారు. సోమవారం డ్రోన్ల సహాయంతో గాలింపు చేపట్టగా కొంచూరు కొండల్లోని గుహలో వీరు తలదాచుకున్నట్లు గుర్తించారు. వెంటనే గ్రామస్థుల సహకారంతో ఇద్దరినీ పట్టుకుని సాయంత్రం తల్లిదండ్రులకు అప్పగించారు. చదువులో వెనకబడ్డామనే బెంగతోనే అడవిలోకి పారిపోయినట్లు బాలికలు చెప్పారని పోలీసులు తెలిపారు.
missing girls
forest escape
Alluri Sitarama Raju district
Pedabayalu
Andhra Pradesh
ashram school
drone search
police search
tribal area
student runaway

More Telugu News