Bus Fire Accident: హైదరాబాద్-విజయవాడ హైవేపై బస్సులో మంటలు.. డ్రైవర్ చాకచక్యంతో తప్పిన పెను ప్రమాదం

Hyderabad Vijayawada Highway Bus Fire Averted by Driver
  • విహారీ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు
  • డ్రైవర్ చాకచక్యంతో సురక్షితంగా బయటపడ్డ 40 మంది
  • చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ఘటన
  • పూర్తిగా కాలి బూడిదైన ప్రైవేట్ బస్సు
  • మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విహారీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. బస్సు పిట్టంపల్లి వద్దకు చేరుకోగానే ఇంజిన్ భాగం నుంచి మంటలు రావడం డ్రైవర్ గమనించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, ప్రయాణికులను అప్రమత్తం చేశారు. దీంతో వారంతా క్షణాల్లో బస్సు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు.

ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి, పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బస్సు కాలి బూడిదైనప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెను ప్ర‌మాదం తప్పింది.
Bus Fire Accident
Hyderabad Vijayawada Highway
Nalgonda
Chityala
Pittampalli
Vihari Travels
Road Accident
Fire Accident

More Telugu News