UIDAI: అందుబాటులోకి కొత్త ఆధార్ యాప్... వివరాలు ఇవిగో!

UIDAI Launches New Aadhar App for Enhanced Security and Sharing
  • యూఐడీఏఐ నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త ఆధార్ యాప్
  • ఆధార్ వివరాల సురక్షిత షేరింగ్ కోసం ప్రత్యేక రూపకల్పన
  • ఒకే డివైజ్‌లో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డుల నిక్షిప్తం
  • ఫేస్ అథెంటికేషన్, బయోమెట్రిక్ లాక్ వంటి భద్రతా ఫీచర్లు
  • ఇది ప్రస్తుతం ఉన్న ఎం-ఆధార్ యాప్‌కు అదనం మాత్రమే
  • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్‌లోడ్‌కు సిద్ధం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారుల కోసం మరో కొత్త మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్‌లోనే ఆధార్ వివరాలను సురక్షితంగా భద్రపరచుకోవడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని సులభంగా పంచుకునేందుకు ఈ యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు యూఐడీఏఐ తెలిపింది. ఈ కొత్త యాప్‌తో ఇకపై భౌతికంగా ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, ఇది పూర్తిస్థాయి పేపర్‌లెస్ అనుభవాన్ని అందిస్తుందని పేర్కొంది.

ఈ యాప్‌లో పలు ఆకర్షణీయమైన ఫీచర్లను పొందుపరిచారు. ముఖ్యంగా, ఒకే డివైజ్‌లో కుటుంబ సభ్యులందరి ఆధార్ వివరాలను కూడా భద్రపరచుకునే వెసులుబాటు కల్పించారు. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫేస్ అథెంటికేషన్ ద్వారా లాగిన్ అయ్యే సౌకర్యం కల్పించారు. మన ఆధార్ వివరాలను ఇతరులతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు, కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే (సెలెక్టివ్ షేరింగ్) పంపే అవకాశం కూడా ఉంది. బయోమెట్రిక్ వివరాలను లాక్ లేదా అన్‌లాక్ చేసుకునే ఆప్షన్, ఆధార్ కార్డు చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో తెలుసుకునే హిస్టరీని చెక్ చేసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉన్నాయి.

అయితే, ప్రస్తుతం వాడుకలో ఉన్న 'ఎం-ఆధార్' (mAadhaar) యాప్‌కు ఇది ప్రత్యామ్నాయం కాదని యూఐడీఏఐ స్పష్టం చేసింది. ఎం-ఆధార్‌లో లభించే డిజిటల్ కార్డు డౌన్‌లోడ్, పీవీసీ కార్డు ఆర్డర్, మొబైల్/ఈ-మెయిల్ వెరిఫికేషన్ వంటి సేవలు ఈ కొత్త యాప్‌లో ఉండవు. కేవలం ఆధార్ డేటాను సురక్షితంగా నిల్వ చేయడం, షేర్ చేయడం కోసమే దీనిని తీసుకొచ్చారు.

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాక, ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి, ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయాలి. అనంతరం, భద్రత కోసం ఒక పిన్ నంబర్‌ను సెట్ చేసుకుని యాప్‌ను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఈ కొత్త యాప్‌తో ఆధార్ సేవలు మరింత సులభంగా, సురక్షితంగా మారతాయని అధికారులు భావిస్తున్నారు.
UIDAI
Aadhar App
Aadhar
mAadhar
Unique Identification Authority of India
Aadhar download
Aadhar services
Aadhar card
Digital Aadhar
Face Authentication

More Telugu News