Anthony Albanese: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

Anthony Albanese Announces Social Media Ban for Under 16s in Australia
  • ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించిన ప్రధాని ఆంథోనీ అల్బనీస్
  • వ‌చ్చే నెల‌ 10 నుంచి కొత్త చట్టం అమల్లోకి
  • ఫేస్‌బుక్, ఇన్‌స్టా, టిక్‌టాక్ సహా ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లకు వర్తింపు
  • పిల్లల ఆన్‌లైన్ భద్రత కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం వెల్లడి
  • సైబర్‌ బుల్లీయింగ్, హానికర కంటెంట్ నుంచి రక్షణే ప్రధాన లక్ష్యం
పిల్లల ఆన్‌లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 16 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఈ ఏడాది డిసెంబర్ 10వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ఈ మేరకు ‘ఆన్‌లైన్ సేఫ్టీ అమెండ్‌మెంట్ (సోషల్ మీడియా మినిమమ్ ఏజ్) బిల్ 2024’ పేరుతో ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు మైనర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), యూట్యూబ్, రెడ్డిట్, కిక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అకౌంట్లు తెరవడం లేదా వాటిని వినియోగించడం చట్టవిరుద్ధం అవుతుంది.

ఆన్‌లైన్‌లో పిల్లలు ఎదుర్కొంటున్న ప్రమాదాల నుంచి వారిని రక్షించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా సైబర్‌ బుల్లీయింగ్, హానికరమైన కంటెంట్ ప్రభావం, సోషల్ మీడియా అల్గారిథమ్‌ల వల్ల కలిగే వ్యసనం వంటి సమస్యల నుంచి పిల్లలను కాపాడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఈ నిర్ణయం ద్వారా పిల్లలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని అందించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Anthony Albanese
Australia
social media ban
children
online safety
cyberbullying
digital safety
social media age restriction
teenagers
internet safety

More Telugu News