Santosh Shirke: 16 లక్షల విలువైన నగల బ్యాగును ఆటోలో మర్చిపోయిన ప్యాసింజర్.. ఆ తర్వాత ఏమైందంటే..!

Honest Auto Driver Santosh Shirke Returns 16 Lakh Jewelry Bag
  • బ్యాగును ఆటో యూనియన్ కు అప్పగించిన డ్రైవర్
  • పోలీసుల సాయంతో అసలు యజమానికి అప్పగింత
  • కృతజ్ఞతగా కొంత డబ్బు ఇవ్వజూపినా తిరస్కరించిన ఆటో డ్రైవర్
బంగారం ధర చుక్కలను అంటుతున్న ఈ రోజుల్లో నగలు దొరికితే చాలామంది గప్ చుప్ గా దాచేసుకుంటారు. కానీ ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ మాత్రం నిజాయతీగా నగలను యజమాని చెంతకు చేర్చాడు. పోయాయని అనుకున్న 16 లక్షల విలువైన నగలు తిరిగి దక్కిన సంతోషంలో ఆ యజమాని కొంత డబ్బు ఇవ్వజూపినా ఆటో డ్రైవర్ తీసుకోలేదు. బాధ్యత కలిగిన పౌరుడిగా తన విధి తాను నిర్వర్తించానని, దానికి ప్రతిఫలం ఆశించనని చెప్పడంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్ ను సన్మానించారు.
 
అసలేం జరిగిందంటే..
నవీ ముంబైలోని వాషికి చెందిన ఓ మహిళ కాశీ యాత్రకు వెళ్లి తిరిగొచ్చారు. వాషి రైల్వే స్టేషన్ లో దిగిన ఆమెను తీసుకెళ్లడానికి ఆమె కొడుకు మోతిలగ్ స్టేషన్ కు వచ్చాడు. ఇద్దరూ కలిసి ఆటోలో ఇంటికి చేరుకున్నారు. వాళ్లను దింపేసి డబ్బులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్ సంతోష్ శిర్కే.. చాలా సేపటికి వెనక సీట్లో ఉన్న బ్యాగును గుర్తించాడు. అందులో ఏముందని తెరచి చూడగా బంగారు నగలు కనిపించాయి. ఆ బ్యాగును ఆటో యూనియన్ కార్యాలయంలో అప్పగించాడు.

అప్పటికే నగల బ్యాగు ఆటోలో మర్చిపోయిన విషయాన్ని మోతిలగ్ తన స్నేహితుడైన మరో ఆటో డ్రైవర్ కు చెప్పగా.. సదరు ఆటో డ్రైవర్ తమ యూనియన్ వాట్సాప్ గ్రూప్ లో విషయం పోస్ట్ చేశాడు. నగల బ్యాగు ఆటో యూనియన్ కార్యాలయంలో ఉందని, వాషి పోలీస్ స్టేషన్ కు రావాలని వారికి సమాచారం ఇచ్చిన సంతోష్.. ఆటో యూనియన్ సభ్యులతో కలిసి నగల బ్యాగును వాషి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాడు.

అనంతరం ఏపీఐ రవీంద్ర నరోటే సమక్షంలో.. నగల వివరాలను సరిచూసుకుని బ్యాగును మోతిలగ్ కు అప్పగించారు. ఈ సందర్భంగా మోతిలగ్ కొంత డబ్బు ఇవ్వజూపగా ఆటో డ్రైవర్ సంతోష్ తిరస్కరించాడు. కాగా, నగల బ్యాగును నిజాయతీగా తిరిగి అప్పగించిన ఆటో డ్రైవర్ సంతోష్ ను పోలీసులు సన్మానించారు.
Santosh Shirke
Mumbai
Navi Mumbai
Auto driver
Gold jewelry
Lost and found
Honesty
Vashi
Motilag
Kashi Yatra

More Telugu News