Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ పార్టీలకు మద్దతు ఇవ్వదు: మోహన్ భగవత్

Mohan Bhagwat RSS Never Supports Parties Only Nation
  • ఏ రాజకీయ పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమన్ప మోహన్ భగవత్ 
  • రామ మందిరానికి కాంగ్రెస్ మద్దతిచ్చినా అండగా నిలిచేవాళ్లమని వెల్లడి
  • కాషాయం మాకు గురువు లాంటిది, అందుకే ఆ జెండాను ఎగరేస్తాం అని వివరణ 
  • విమర్శలను పట్టించుకోం.. అవే మాకు మరింత ప్రచారం కల్పిస్తాయి అని వ్యాఖ్యలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏ ఒక్క వ్యక్తికి గానీ, రాజకీయ పార్టీకి గానీ మద్దతు ఇవ్వదని, కేవలం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడే విధానాలకు మాత్రమే కట్టుబడి ఉంటుందని ఆ సంస్థ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా బెంగళూరులో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రసంగ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓ ప్రశ్నకు భగవత్ బదులిస్తూ, "మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వం. ఎన్నికల రాజకీయాల్లో పాల్గొనబోము. సమాజాన్ని ఏకం చేసే పనిలో సంఘ్ నిమగ్నమై ఉంది. కానీ రాజకీయాలు స్వభావరీత్యా విభజనకారిగా ఉంటాయి" అని వివరించారు. దేశానికి మేలు చేసే విధానాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, తమ ప్రభావాన్ని ఉపయోగించి సరైన విధానాలకు అండగా నిలుస్తామని తెలిపారు. 

"ఉదాహరణకు, అయోధ్యలో రామ మందిరం కావాలని మేము కోరుకున్నాం. ఆ లక్ష్యం కోసం నిలబడిన వారికి మా వలంటీర్లు మద్దతు ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీ ఆ ఉద్యమంలో ఉంది కాబట్టి వారికి మద్దతిచ్చాం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రామమందిర ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఉంటే, మా కార్యకర్తలు ఆ పార్టీతోనే నిలబడేవారు" అని ఆయన తేల్చిచెప్పారు.

"మాకు ఏ పార్టీ సొంతం కాదు, అలాగని ఏ పార్టీ పరాయిదీ కాదు. ఎందుకంటే అవన్నీ భారతీయ పార్టీలే. మేము 'రాష్ట్ర నీతి'కి మద్దతిస్తాం, 'రాజనీతి'కి కాదు. ఈ దేశం ఏ దిశలో పయనించాలనే దానిపై మాకు ఒక దార్శనికత ఉంది. ఆ దిశగా ఎవరు పనిచేసినా వారికి మా మద్దతు ఉంటుంది" అని భగవత్ పేర్కొన్నారు.

జెండా వివాదంపై స్పష్టత

జాతీయ జెండాకు బదులుగా ఆర్ఎస్ఎస్ ఎందుకు కాషాయ జెండా (భగవా ధ్వజ్)ను ఉపయోగిస్తుందన్న ప్రశ్నకు ఆయన వివరణ ఇచ్చారు. "సంఘ్ 1925లో ప్రారంభమైంది. మాకు ఒక గురువు అవసరం. కానీ వ్యక్తిని గురువుగా స్వీకరిస్తే, వారికి పరిమిత ఆయుష్షు ఉంటుంది. అందుకే శాశ్వతంగా ఉండే మన సంస్కృతికి, హిందూత్వానికి ప్రతీకగా కాషాయ జెండాను గురువుగా స్వీకరించాం" అని తెలిపారు. 

జాతీయ జెండాను 1937లో ఖరారు చేశారని, దాని రూపకల్పన జరిగినప్పటి నుంచి తాము త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తూనే ఉన్నామని అన్నారు. "ప్రైవేట్ సంస్థలు జాతీయ జెండాను ఎగురవేయవచ్చని కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, జనవరి 26, ఆగస్టు 15న అన్ని శాఖలలో జెండా వందనం చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీకి ఎర్ర జెండా, కాంగ్రెస్‌కు వారి జెండా ఉన్నట్లే, మాకు కాషాయ జెండా ఉంది. ఇందులో వివాదం ఏమీ లేదు" అని స్పష్టం చేశారు.

మీడియా విమర్శలపై స్పందిస్తూ, "ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కొందరి పని సంఘ్ గురించి సందేహాలు రేకెత్తించడమే. వారి విమర్శల వల్లే మాకు మరింత ఆదరణ పెరుగుతోంది. నిజం తెలిసినా కొందరు విమర్శిస్తూనే ఉంటారు. మేము వాటిని పట్టించుకోకుండా దేశం కోసం మా పని మేము చేసుకుంటూ పోతాం" అని మోహన్ భగవత్ అన్నారు.
Mohan Bhagwat
RSS
Rashtriya Swayamsevak Sangh
BJP
Ram Mandir
Ayodhya
Bhagwa Dhwaj
National Flag
Politics
India

More Telugu News