Revanth Reddy: కేటీఆర్ జీవితంలో అధికారం అనే రేఖ లేదు... శ్రీలీల ఐటమ్ సాంగ్ గుర్తుకొస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Slams KTR Compares to Sreeleela Item Song
  • హైదరాబాదులో మీట్ ది ప్రెస్ కార్యక్రమం
  • జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు
  • కేటీఆర్ దశ బాగా లేదు... కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ప్రయోజనం లేదని ఎద్దేవా
  • పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారారని విమర్శలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్ జాతకంలో అధికార యోగం అనే రేఖే లేదని, ఆయన దశ బాగోలేనప్పుడు తండ్రి కేసీఆర్ ఎన్ని దిశలు మార్చినా ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారారని ఆయన అభివర్ణించారు. రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్‌' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తుంటే 'పుష్ప' సినిమాలోని శ్రీలీల ఐటమ్ సాంగ్‌ గుర్తుకొస్తోందని అన్నారు. 

ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేశారని ఆరోపించారు. "వ్యవసాయం, విద్య, వైద్యం.. ఇలా ఏ రంగంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించలేదు. వేల కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా? కానీ మా ప్రభుత్వం కాళేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి చేసి చూపించింది" అని తెలిపారు. కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, భీమా, నెట్టెంపాడు వంటి కీలక ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని, ప్రజలకు ఉపయోగపడని కమాండ్ కంట్రోల్ సెంటర్, ప్రగతిభవన్, సచివాలయం వంటి భవనాలు మాత్రమే నిర్మించారని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ పథకాన్నీ రద్దు చేయలేదని, వాటిని కొనసాగిస్తూనే కొత్త హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రాష్ట్ర గీతం వంటి హామీలను నెరవేర్చామని గుర్తుచేశారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టిన తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని, ఎవరూ సాహసించని కులగణనను ప్రారంభించామని గర్వంగా చెప్పారు.

రాష్ట్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలది ఫెవికాల్ బంధమని, రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సెమీ కండక్టర్ కంపెనీ తరలింపునకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు ఆదేశించినా, కేంద్రం ఎందుకు దర్యాప్తు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ తెచ్చుకుంటే దేశం మొత్తం గెలిచినట్లేనని సవాల్ విసిరారు.

"రాసిపెట్టుకోండి.. తెలంగాణలో మరో 8 ఏళ్ల పాటు మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. 2028 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు రావు, 2029 జూన్‌లో దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు వస్తాయి. 2034 జూన్ వరకు మేమే పాలిస్తాం" అని రేవంత్ రెడ్డి పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
Revanth Reddy
KTR
Telangana
BRS
Congress
CM Revanth Reddy
Telangana Politics
Kaleshwaram Project
Srileela item song
Assembly Elections

More Telugu News