Devajit Saikia: ఆసియా కప్ ట్రోఫీ వివాదం... స్పందించిన బీసీసీఐ కార్యదర్శి సైకియా

Devajit Saikia Responds to Asia Cup Trophy Dispute
  • నఖ్వీతో జరిగిన చర్చలు సఫలమయ్యాయన్న దేవజిత్ సైకియా
  • వివాద పరిష్కారానికి ఇరుపక్షాలు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడి
  • ట్రోఫి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామన్న సైకియా
ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు బీసీసీఐ, పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వీ ఒక అవగాహనకు వచ్చినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో నఖ్వీతో చర్చలు సఫలమయ్యాయని, వివాద పరిష్కారానికి ఇరుపక్షాలు సానుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

భారత జట్టు సెప్టెంబర్ 28న ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అలాగే, పాక్‌కు చెందిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించడానికి సమ్మతించలేదు. నఖ్వీ కూడా ట్రోఫీ, మెడల్స్‌ను వేరొకరి ద్వారా అందించకుండా తన వెంట తీసుకువెళ్లారు. ఈ వివాదం రెండు నెలలుగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో ఐసీసీ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఐసీసీ సమావేశానికి నఖ్వీ హాజరయ్యారని, అజెండాలో లేనప్పటికీ తాను, నఖ్వీ ఐసీసీ అధికారుల సమక్షంలో సమావేశమయ్యామని దేవజిత్ తెలిపారు. చర్చల ప్రక్రియ ప్రారంభం కావడం శుభసూచకమని, ఇరు పక్షాలు ఈ సమావేశంలో నిర్మాణాత్మకంగా పాల్గొన్నాయని ఆయన అన్నారు. ఆసియా కప్ ట్రోఫీ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
Devajit Saikia
Asia Cup Trophy
BCCI
PCB
Najam Sethi
ICC Meeting
India vs Pakistan

More Telugu News