Mahesh Kumar Goud: జూబ్లీహిల్స్‌లో పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud Alleges Voter Irregularities in Jubilee Hills by BJP
  • ఈసీని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని విమర్శ
  • ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందన్న టీపీసీసీ చీఫ్
  • మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితాలు రాలేదన్న మీనాక్షి
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈసీని గుప్పెట్లో పెట్టుకుని బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దీనిని రాహుల్ గాంధీ ఇదివరకే ఆధారాలతో సహా నిరూపించారని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కలిసి ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అందరూ భావించారని, కానీ అక్కడ బీజేపీ గెలుపొందిందని గుర్తు చేశారు. హర్యానాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాలలోని వ్యక్తులను సైతం ఓటర్లుగా చేర్చినట్లు తెలిపారు. బీహార్‌లో తమకు బలం లేని చోట బీజేపీ ఓట్లను తొలగించిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఈసీని ప్రశ్నించారని, కానీ ఎలాంటి సమాధానం రాలేదని విమర్శించారు. ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని, ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాల సేకరణ జరిగిందని అన్నారు.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితాలు రాలేదని మీనాక్షి నటరాజన్ అన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు. ఓట్ల చోరీపై ఇటీవల రాహుల్ గాంధీ మీడియాకు వివరాలు వెల్లడించారని, కొన్ని ప్రాంతాల్లో ఒకే చిరునామాతో ఎక్కువ ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. హర్యానాలో 8 సీట్లలో 400 ఓట్ల వ్యత్యాసంతో కాంగ్రెస్ ఓడిపోయిందని గుర్తు చేశారు.
Mahesh Kumar Goud
Jubilee Hills
Telangana Congress
Voter fraud
BJP
Rahul Gandhi

More Telugu News