Nara Lokesh: టీడీపీతోనే బీసీలకు రాజకీయ స్వాతంత్ర్యం.. కురుబ సోదరులను గుండెల్లో పెట్టుకుంటాం: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Promises Support for Kuruba Community in Anantapur
  • టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను మరువమ‌న్న మంత్రి 
  • కనకదాస జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని ప్రకటన
  • కళ్యాణదుర్గంలో భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన లోకేశ్‌
  • భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత టీడీపీదేనని హామీ
  • పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తామని స్పష్టీకరణ
టీడీపీకి అండగా నిలిచిన కురుబ సోదరులను ఎప్పటికీ మరువబోమని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ భరోసా ఇచ్చారు. భక్త కనకదాస 538వ జయంతిని పురస్కరించుకుని కళ్యాణదుర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్త కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం లోకేశ్‌ ప్రసంగించారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నామని, ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజని అన్నారు.

పాదయాత్ర హామీలు నెరవేరుస్తాం
తన యువగళం పాదయాత్రలో కురుబ సోదరుల సమస్యలను దగ్గర నుంచి చూశానని, వారి కోరిక మేరకే కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని లోకేశ్‌ గుర్తుచేశారు. కురుబల ఆరాధ్య దైవమైన బెర్రప్ప గుడులను టీటీడీ సహకారంతో నిర్మిస్తామని, పూజారులకు గౌరవ వేతనం అందించేందుకు త్వరలోనే జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కురుబ కమ్యూనిటీ భవనాలను రాబోయే 12 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గొర్రెల పెంపకందారుల కోసం షెడ్ల నిర్మాణం, బీమా సౌకర్యం, దాణా, మేత భూముల సమస్యలను పరిష్కరించి వారి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

అనంతపురం జిల్లాకు రుణపడి ఉంటాం
టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని, టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని లోకేశ్‌ అన్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలకు తమ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను మూడుసార్లు, హరికృష్ణను ఒకసారి, బాలకృష్ణను మూడుసార్లు గెలిపించిన ఘనత ఈ జిల్లాదేనని గుర్తు చేసుకున్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, జిల్లాలో హార్టికల్చర్‌కు చేయూతనిచ్చి తలసరి ఆదాయంలో రాష్టంలో మూడో స్థానానికి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా జిల్లాలో సేవలందిస్తున్న ఆర్డీటీ సంస్థ లైసెన్సు పునరుద్ధరణకు కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.

టీడీపీతోనే కురుబలకు రాజకీయ గుర్తింపు
టీడీపీ హయాంలోనే కురుబ సామాజిక వర్గానికి రాజకీయంగా, ఆర్థికంగా స్వాతంత్య్రం వచ్చిందని లోకేశ్‌ అన్నారు. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.300 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఎస్.రామచంద్ర రెడ్డి, బీకే పార్ధసారధి, నేటి మంత్రులు సవిత, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు వంటి ఎందరో కురుబ నేతలను టీడీపీ ప్రోత్సహించిందని వివరించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి పాలన చూశామని, బీసీలపై దాడులు జరిగాయని విమర్శించారు. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి 94 శాతం సీట్లతో చారిత్రక విజయాన్ని అందించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కురుబ సవిత, పయ్యావుల కేశవ్, ఎంపీలు పార్థసారధి, బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కురుబ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Nara Lokesh
TDP
Kuruba community
Anantapur district
Kanaka Dasa Jayanti
BC welfare
Andhra Pradesh politics
Payyavula Keshav
Basti Nagraju
Savitha

More Telugu News