US Layoffs: అమెరికాలో ఉద్యోగాల ఊచకోత.. ఈ ఏడాది 10 లక్షలకు పైగా లేఆఫ్స్

US Job Market Mass Layoffs Hit Over 1 Million in 2025
  • అమెరికాలో ఉగ్రరూపం దాల్చిన ఉద్యోగాల కోతలు
  • అక్టోబర్‌లో మూడు రెట్లు పెరిగిన లేఆఫ్స్
  • ఏఐ, ద్రవ్యోల్బణం, షట్‌డౌన్ ప్రధాన కారణాలని వెల్లడి
  • భయంతో ఉద్యోగాలు మారేందుకు జంకుతున్న అమెరికన్లు
అమెరికా ఉద్యోగ విపణిలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంత అనిశ్చితి నెలకొంది. అక్టోబర్ నెలలో అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగాల కోత విధించాయి. సెప్టెంబర్‌తో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికంగా 1,53,074 మందిని తొలగించినట్లు ప్రైవేట్ కన్సల్టింగ్ సంస్థ 'చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్' తన నివేదికలో వెల్లడించింది.

ఈ ఏడాది ఇప్పటివరకు మొత్తం 10.9 లక్షల ఉద్యోగాల కోత నమోదైందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 65 శాతం అధికమని 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' తన కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభించిన 2020 తర్వాత ఈ స్థాయిలో లేఆఫ్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. మరోవైపు, అమెరికా చరిత్రలోనే సుదీర్ఘంగా కొనసాగుతున్న ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అధికారిక ఉద్యోగ డేటా విడుదల నిలిచిపోవడంతో ఆర్థికవేత్తలు ప్రైవేట్ రంగ సంకేతాలపై ఆధారపడాల్సి వస్తోంది.

ఏఐ, ద్రవ్యోల్బణం, షట్‌డౌన్.. త్రిముఖ దాడి
విశ్లేషకుల ప్రకారం ఈ ఉద్యోగాల కోతకు ఒకేసారి అనేక కారణాలు తోడయ్యాయి. టారిఫ్‌ల వల్ల పెరుగుతున్న ఖర్చులు, వినియోగదారుల నుంచి తగ్గుతున్న డిమాండ్, అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ వైపు వేగంగా మొగ్గు చూపడం వంటివి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. "తక్కువ మంది సిబ్బందితోనే కంపెనీలు కార్యకలాపాలు నిర్వహించగలమని భావిస్తున్నాయి. ఇది కార్మిక మార్కెట్‌లో దీర్ఘకాలిక పునర్వ్యవస్థీకరణలో భాగం" అని ఈవై-పార్థినాన్ చీఫ్ ఎకనమిస్ట్ గ్రెగొరీ డాకో వివరించారు. ముఖ్యంగా టెక్, వైట్ కాలర్ రంగాలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రైవేట్ డేటా ఏం చెబుతోంది?
ప్రభుత్వ అధికారిక డేటా అందుబాటులో లేకపోవడంతో ఇండీడ్, లింక్డ్‌ఇన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల నివేదికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
  • అక్టోబర్‌లో ఉద్యోగ నియామకాలు 0.8 శాతం తగ్గినట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది.
  • ఉద్యోగ ప్రకటనలు 2021 తర్వాత అత్యంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయని ఇండీడ్ పేర్కొంది.
  • ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం గణనీయంగా తగ్గిందని, ఉద్యోగ భద్రతపై ఆందోళన పెరిగిందని గ్లాస్‌డోర్ నివేదిక వెల్లడించింది.
"ఉద్యోగ మార్కెట్ క్రమంగా బలహీనపడుతోంది, కానీ ఇంకా పూర్తిగా కుప్పకూలలేదు" అని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఆర్థికవేత్త డేవిడ్ టిన్స్లీ అన్నారు.

వినియోగదారులపై ప్రభావం
ఈ లేఆఫ్‌ల పర్వం కేవలం నిరుద్యోగ సమస్యకే పరిమితం కాదని, రాబోయే పండుగ సీజన్‌లో వినియోగదారుల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అధిక వడ్డీ రేట్లు, బలహీనమైన నియామకాలు, పెరుగుతున్న లేఆఫ్‌లు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది అమెరికన్లు ఉన్న ఉద్యోగాలనే కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మారడం తగ్గిపోయిందని, ఇది మార్కెట్‌లో మార్పునకు బలమైన సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ షట్‌డౌన్ ముగిసి, ఆర్థిక వ్యవస్థపై నమ్మకం పెరిగితే తప్ప ఈ అనిశ్చితి తొలగిపోయేలా కనిపించడం లేదు.
US Layoffs
United States Jobs
Layoffs 2023
Job Market
Economic Uncertainty
Challenger Gray and Christmas
Inflation
Artificial Intelligence
Interest Rates
Job Security

More Telugu News