మరాఠీ వైపు నుంచి వచ్చిన కంటెంట్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఆదరణ పెరుగుతూ పోతోంది. మరాఠీ నుంచి ఇటీవల వచ్చిన 'జారన్' సినిమాను అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 'జారన్' అంటే మరాఠీలో 'చేతబడి' అని అర్థం. చేతబడి నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, జూన్ 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆగస్టు 8వ తేదీన ఓటీటీకి వచ్చిన ఈ సినిమా, రీసెంటుగా తెలుగులో అందుబాటులోకి వచ్చింది. 

కథ: రాధ (అమృత సుభాశ్) కి శేఖర్ తో వివాహమవుతుంది .. వారి కూతురే సైయీ. సిటీలోని పెద్దబంగ్లాలో వారి నివాసం. అక్కడి దూరంగా ఉన్న ఒక విలేజ్ లో రాధ తల్లిదండ్రులు ఉంటారు. చాలా కాలంగా ఉంటూ వచ్చిన పాతకాలం నాటి తమ ఇల్లును వారు అమ్మకానికి పెడతారు. ఆ ఇంట్లో చివరిసారిగా 'గెట్ టు గెదర్' ను ఏర్పాటు చేస్తారు. తన కూతురు 'సైయీ'ని తీసుకుని రాధ కూడా తన పుట్టింటికి చేరుకుంటుంది. తల్లిదండ్రులు వారిని ఎంతో ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. 

 ఆ ఇంట్లోని ఒక గదికి తలుపులు వేసి ఉంటాయి. ఆ గది 'కీ' హోల్ లో నుంచి లోపలికి చూసిన రాధకి ఒక 'బొమ్మ' కనిపిస్తుంది. రాధకి పదేళ్ల వయసున్నప్పుడు, ఆ గదిలో 'గంగూతి' (అనితా దాటే కేల్కర్) ఉండేది. ఆమె చేతబడి చేస్తుందని అంతా భయపడేవారు. ఆమెతో ఆ గదిని ఖాళీ చేయించమని ఇరుగు పొరుగువారు రాధ తల్లితో చెబుతారు. ఆమె వినిపించుకోకపోవడంతో, చుట్టుపక్కల వారే ఆమెను తరిమేస్తారు. ఆమె క్షుద్రపూజలు చేసిన ఆనాటి 'బొమ్మ' అలాగే ఉంటుంది.

గంగూతి ఆ ఊరొదిలి వెళ్లిపోతూ, తాను రాధకి చేతబడి చేసినట్టుగా చెబుతుంది. అప్పటి నుంచి రాధ ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆమెకి విరుగుడు చేయించడానికి తల్లి చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. మళ్లీ ఇంతకాలానికి తిరిగొచ్చిన రాధ, తన కూతురు సైయీ కోసం ఆ వికృతమైన బొమ్మను గదిలో నుంచి బయటికి తీసుకొస్తుంది. అప్పటి నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి?  అనేది మిగతా కథ. 

విశ్లేషణ: 'చేతబడి' నేపథ్యంలో గతంలో చాలా భాషల్లో .. చాలానే సినిమాలు వచ్చాయి. నిజానికి దెయ్యాల సినిమాలను ధైర్యంగా చూసేవారు సైతం చేతబడి నేపథ్యంలోని సినిమాలను చూడటానికి భయపడుతుంటారు. అందుకు కారణంగా చేతబడికి సంబంధించిన తాంత్రిక వాతావరణం మనసుపై మరింత ప్రభావం చూపించేలా ఉండటమే. అలాంటి చేతబడి నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. 

మానసిక వ్యాధితో బాధపడే రాధ అనే పాత్ర. దానికి తోడు చిన్నతనంలో ఆమెపై జరిగిన క్షుద్ర ప్రయోగం. ఈ రెండు సమస్యల నుంచి తమ కూతురును కాపాడుకోవడం కోసం ఆరాటపడే ఒక కుటుంబం. ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ కథకు, మరాఠీ సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ లొకేషన్స్ లో మంచి అవుట్ పుట్ ను అందించారని అనిపిస్తుంది. 
           
ఈ కథ నడుస్తున్నప్పుడు అందరినీ కొన్ని ప్రశ్నలు వెంటాడుతూ ఉంటాయి. మానసిక స్థితి సరిగ్గా లేని తల్లి దగ్గర .. కూతురును ఎలా ఉంచారు. ఆ అమ్మాయిని అమ్మమ్మ - తాతయ్య చూసుకోవచ్చుగా అనిపిస్తుంది. ఈ వైపు నుంచి ఇచ్చిన ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక వేషధారణతోనే భయపెట్టేలా ఉన్న ఒక ఒంటరి స్త్రీకి ఎవరైనా అద్దెకి ఇల్లు ఇస్తారా? క్షుద్రపూజలు చేసిన బొమ్మను అలా గదిలోనే ఉంచుతారా? అనే డౌట్ మాత్రం అలాగే ఉండిపోతుంది. 

పనితీరు: దర్శకుడు ఈ కథను ఆవిష్కరించిన విధానం బాగుంది. ఇటు మానసిక వ్యాధి పరంగా .. అటు క్షుద్రశక్తి వైపు నుంచి కూడా తాను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పాడు. అయితే అసలు సమస్యకి సంబంధించి ప్రేక్షకులలో తలెత్తిన సందేహాన్ని .. వారి ఊహకే వదిలేశాడు. పాత్రలను డిజైన్ చేసిన విధానం , ట్విస్టులు ఆకట్టుకుంటాయి.

నటీనటుల పనితీరు మెప్పిస్తుంది. అమృత సుభాశ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. మానసిక వ్యాధితో బాధపడేవారి ప్రవర్తన ఎలా ఉంటుందనేది ఆమె ఆ పాత్ర ద్వారా పలికించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ వర్క్ నీట్ గా ఉన్నాయి. 

ముగింపు
: గ్రామంలోని మూఢనమ్మకాల మధ్య .. 'చేతబడి' భయాల మధ్య పెరిగిన ఒక అమ్మాయి జీవితంపై ఆ ప్రభావం ఎలా పడింది? ఆమె జీవితాన్ని అవి ఎలా ప్రభావితం చేశాయి? అనే కోణంలో నడిచిన ఈ కథ ప్రేక్షకులకు కుతూహలాన్ని రేకెత్తిస్తూ సాగుతుంది. కొన్ని సందేహాలకు సమాధానాలు దొరక్కపోయినా, ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ తరహా జోనర్ ను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.