Indigo Airlines: ఇండిగో విమానంలో కాలిన వాసన... హడలిపోయిన ప్రయాణికులు

Indigo Flight Passengers Panic After Burning Smell in Cabin
  • ఇండిగో విమానంలో గాల్లో ఉండగా ఘాటైన వాసన
  • భయంతో వణికిపోయిన ప్రయాణికులు
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • విమానం కొత్తదని చెప్పిన విమాన సిబ్బంది
  • అసలు కారణం చెప్పకుండానే సేఫ్‌గా ల్యాండింగ్
  • విమానయాన సంస్థ భద్రతపై నెటిజన్ల చర్చ
ఇండిగో విమానంలో ప్రయాణికులకు ఓ భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా క్యాబిన్‌లో ఒక్కసారిగా తీవ్రమైన మంటల వాసన రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కొందరు భయంతో విలపించారు. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, విమానం గాల్లో ఉండగా ఏదో కాలిపోతున్నట్లుగా ఘాటైన వాసన వచ్చింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. విమాన సిబ్బంది కూడా కంగారు పడుతూ వాసన ఎక్కడి నుంచి వస్తుందోనని ఓవర్‌హెడ్ బిన్‌లను తనిఖీ చేయడం వీడియోలో కనిపించింది. "విమానాన్ని కిందకు దించేయండి" అని ఒకరు అరుస్తున్నట్లు కూడా ఉంది.

ప్రయాణికులు వాసన గురించి అడగ్గా, ఇది కొత్త విమానమని, కేవలం రెండు ట్రిప్పులు మాత్రమే పూర్తి చేసిందని సిబ్బంది చెప్పినట్లు ఆ ప్రయాణికుడు వివరించాడు. "సిబ్బంది ప్రయాణికులను శాంతపరచడంలో బాగానే పనిచేశారు. కానీ, వాసనకు సరైన సాంకేతిక కారణం చెప్పలేకపోయారు. వాసన చాలా ఎక్కువఉంది, అది క్రమంగా పెరుగుతూనే ఉంది" అని అతను తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

చివరికి విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే, అసలు ఏం జరిగిందో, ఆ వాసనకు కారణం ఏంటో ప్రయాణికులకు ఎవరూ స్పష్టంగా చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విమానయాన సంస్థల భద్రతా ప్రమాణాలపై నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. "కొత్త విమానం కాబట్టి కొన్ని భాగాల పూతలు వేడికి కరిగి వాసన వచ్చి ఉండొచ్చు" అని ఒకరు కామెంట్ చేయగా, "ఇంజిన్ నుంచి పొగ వచ్చి ఉండవచ్చు" అని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో మరో నెటిజన్, ఇండిగో సర్వీసుల నాణ్యత తగ్గిపోతోందని తన అనుభవాన్ని పంచుకున్నారు. మొత్తానికి ఈ ఘటన ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది.
Indigo Airlines
Indigo flight
flight emergency
burning smell
airplane cabin
passenger safety
aviation safety
flight scare
viral video
Indian aviation

More Telugu News