Virat Kohli: పెళ్లి తర్వాత కోహ్లీ చాలా మారిపోయాడు: కైఫ్

Virat Kohli Changed After Marriage Says Kaif
  • నవంబరు 5న 37వ పుట్టినరోజు జరుపుకున్న విరాట్ కోహ్లీ
  • గతంతో పోలిస్తే ఇప్పుడు కోహ్లీ ప్రశాంతంగా ఉంటున్నాడన్న కైఫ్
  • మైదానం బయట మాత్రం కోహ్లీలో మార్పు లేదని వెల్లడి
టీమిండియా పరుగుల యంత్రం, ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ నవంబరు 5న 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, తన సుదీర్ఘ కెరీర్ చివరి దశలో ఉన్నాడు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పలువురు మాజీ క్రికెటర్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్... అనేక సంవత్సరాలుగా కోహ్లీలో వచ్చిన మార్పులను ఆసక్తికరంగా వివరించాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "గతంతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఇప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు. అతనొక తండ్రి. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కోహ్లీలో చాలా తేడా గమనించవచ్చు... ముఖ్యంగా పెళ్లయిన తర్వాత చాలా మారిపోయాడు" అని వెల్లడించాడు.

ఐపీఎల్‌లో జరిగిన ఒక సంఘటనను కైఫ్ గుర్తుచేసుకున్నాడు. "ఒక మ్యాచ్‌లో కగిసో రబాడా బౌలింగ్‌లో కోహ్లీ క్రీజు వదిలి ముందుకొచ్చి బౌండరీ కొట్టాడు. ఆ మ్యాచ్ తర్వాత నేను మాట్లాడినప్పుడు, 'రబాడాపై ఆరంభంలోనే దాడి చేయకపోతే, అతను నన్ను ఆడనిచ్చేవాడు కాదు. అందుకే తొలి బంతికే ఎదురుదాడి చేయాలనుకున్నా' అని నాతో చెప్పాడు. ఆటపై అతనికున్న అవగాహన, ప్రశాంతతతో పాటు మెరుగైంది" అని కైఫ్ వివరించాడు.

అదే సమయంలో, మైదానం బయట మాత్రం కోహ్లీలో ఎలాంటి మార్పు రాలేదని కైఫ్ స్పష్టం చేశాడు. "ఇన్ని సంవత్సరాల అనుభవం తర్వాత కూడా అతను నన్ను అదే గౌరవంతో పలకరిస్తాడు. ఒకప్పుడు 'బ్రదర్' అని పిలిస్తే, ఇప్పుడు కూడా అదే ఆప్యాయత చూపిస్తాడు. ఈ విషయంలో మాత్రం అతడు అస్సలు మారలేదు" అని తెలిపారు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ, వన్డేల్లో 305 మ్యాచ్‌లలో 14,255 పరుగులు సాధించి, 51 సెంచరీలతో అత్యధిక శతకాల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో రెండుసార్లు డకౌట్ అయినా, చివరి మ్యాచ్‌లో 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లీ ఫిట్‌గా ఉంటే 2027 ప్రపంచకప్‌కు ఆడించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే, అది అతనికి ఐదో ప్రపంచకప్ అవుతుంది.
Virat Kohli
Virat Kohli retirement
Virat Kohli birthday
Mohammad Kaif
India cricket
Indian cricket team
IPL
Kagiso Rabada
Cricket records
ICC World Cup 2027

More Telugu News