Aishwarya Rai: రూ.4 కోట్ల పన్ను వివాదం కేసులో గెలిచిన ఐశ్వర్యారాయ్

Aishwarya Rai Wins 4 Crore Tax Dispute Case
  • ఆదాయపు పన్ను శాఖతో కేసులో నటి ఐశ్వర్య రాయ్‌కు విజయం
  • రూ.4 కోట్లకు పైగా పన్ను డిమాండ్‌ వివాదంలో భారీ ఊరట
  • ఐటీ అధికారి నిర్ణయాన్ని తోసిపుచ్చిన ముంబై అప్పీలేట్ ట్రైబ్యునల్
  • ఆమె స్వయంగా ప్రకటించిన రూ.49 లక్షల డిస్‌అలౌవెన్స్‌కే ఐటీఏటీ ఆమోదం
  • అధికారుల లెక్కింపులో లోపాలున్నాయని ట్రైబ్యునల్ స్పష్టీకరణ
ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ కు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ)తో ఉన్న వివాదంలో భారీ ఊరట లభించింది. సుమారు రూ.4 కోట్లకు సంబంధించిన పన్నుల కేసులో ముంబై ఇన్‌కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ (ITAT) ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. 2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి, ఆమె స్వయంగా లెక్కించి చూపిన ఖర్చుల మినహాయింపును (డిస్‌అలౌవెన్స్‌) ట్రైబ్యునల్ సమర్థించింది.

అసలేం జరిగింది?

2022-23 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ ఐశ్వర్యారాయ్ తన మొత్తం ఆదాయాన్ని రూ.39.33 కోట్లుగా ప్రకటిస్తూ రిటర్న్స్ దాఖలు చేశారు. అయితే, ఆమె రిటర్న్స్‌ను పూర్తిస్థాయి పరిశీలనకు (స్క్రూటినీ) ఎంపిక చేసిన ఆదాయపు పన్ను శాఖ, ఆమె లెక్కలతో విభేదించింది. పన్ను మినహాయింపు ఉన్న ఆదాయం కోసం పెట్టిన ఖర్చుల కింద ఐశ్వర్య స్వయంగా రూ.49 లక్షలను డిస్‌అలౌ చేశారు. కానీ అసెసింగ్ ఆఫీసర్ (AO) ఈ లెక్కను తిరస్కరించి, నిబంధనలకు విరుద్ధంగా రూ.4.60 కోట్లను డిస్‌అలౌ చేశారు. దీంతో ఐశ్వర్యపై అదనంగా రూ.4.11 కోట్ల భారం పడింది. దీనిని ఆమె ముందుగా కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ (అప్పీల్స్)లో, ఆ తర్వాత ఐటీఏటీలో సవాలు చేశారు.

ట్రైబ్యునల్ కీలక వ్యాఖ్యలు

ఈ కేసును విచారించిన ఐటీఏటీ, ఆదాయపు పన్ను శాఖ అధికారి నిర్ణయంలో పలు లోపాలను ఎత్తి చూపింది. ఐశ్వర్య స్వయంగా ప్రకటించిన డిస్‌అలౌవెన్స్‌ను తిరస్కరించడానికి అసెసింగ్ ఆఫీసర్ సరైన కారణాలను నమోదు చేయలేదని స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం, రూల్ 8Dని వర్తింపజేయడానికి ముందు అసెసింగ్ ఆఫీసర్ తన అసంతృప్తిని రికార్డుల్లో నమోదు చేయడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పును ట్రైబ్యునల్ గుర్తుచేసింది.

మరో కీలక అంశమేమిటంటే, ఐశ్వర్య తన ఖాతాల్లో చూపిన మొత్తం ఖర్చులు రూ.2.48 కోట్లు కాగా, అధికారులు లెక్కించిన డిస్‌అలౌవెన్స్ రూ.4.60 కోట్లుగా ఉంది. మొత్తం ఖర్చుల కంటే డిస్‌అలౌవెన్స్ ఎక్కువగా ఉండటం అహేతుకమని ట్రిబ్యునల్ అభిప్రాయపడింది. ఈ కారణాలతో, ఐటీ అధికారి విధించిన అదనపు రూ.4.11 కోట్ల డిస్‌అలౌవెన్స్‌ను రద్దు చేసింది. ఐశ్వర్య స్వయంగా ప్రకటించిన రూ.49 లక్షల డిస్‌అలౌవెన్స్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ అక్టోబర్ 31న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు సెక్షన్ 14A కింద వచ్చే ఇలాంటి కేసులలో ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తుందని పన్ను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Aishwarya Rai
Aishwarya Rai tax case
Income Tax Department
Mumbai ITAT
tax dispute
tax tribunal
assessment year 2022-23
income tax appeal
tax exemption
section 14A

More Telugu News