Sri Charani: శ్రీ చరణి ఇచ్చిన జెర్సీని ఆప్యాయంగా స్వీకరించిన సీఎం చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

CM Chandrababu Affectionately Receives Jersey Given by Sri Charani
  • ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన క్రికెటర్ శ్రీ చరణి
  • సీఎంకు టీమిండియా సంతకాలతో కూడిన జెర్సీ బహూకరణ
  • భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష
  • శ్రీ చరణిని అభినందించిన మంత్రి నారా లోకేశ్
  • తెలుగమ్మాయికి భారీ ప్రోత్సాహకం ప్రకటించిన ప్రభుత్వం
  • గ్రూప్-1 ఉద్యోగంతో పాటు రూ.2.5 కోట్ల నజరానా
ఐసీసీ మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యురాలు, తెలుగమ్మాయి శ్రీ చరణి ముఖ్యమంత్రి చంద్రబాబును నేడు మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తనతో పాటు సహచర క్రీడాకారులు సంతకాలు చేసిన టీమిండియా జెర్సీని ఆమె ముఖ్యమంత్రికి బహూకరించింది. శ్రీ చరణి అభిమానంతో ఇచ్చిన ఆ జెర్సీని సీఎం చంద్రబాబు ఆప్యాయంగా స్వీకరించారు. శుక్రవారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొన్నారు. శ్రీ చరణికి ఆయన పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా శ్రీ చరణిని, మహిళా క్రికెట్ జట్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. ప్రపంచకప్ గెలిచి భారత మహిళల సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. ఎందరో యువ క్రీడాకారిణులకు శ్రీ చరణి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఓ వీణ బొమ్మను జ్ఞాపికగా బహూకరించారు.

ఈ క్రమంలో, తనకు మద్దతుగా నిలిచినందుకు శ్రీ చరణి ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా పాల్గొన్నారు.

అంతకుముందు, గన్నవరం విమానాశ్రయంలో శ్రీ చరణికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఆమెకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. వారంతా ఆమెతో పాటు సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.

ఈ సందర్భంగా, శ్రీ చరణి చారిత్రక విజయానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఆమెకు రూ.2.5 కోట్ల నగదు బహుమతిని అందజేయనున్నట్టు తెలిపారు. దీంతో పాటు కడపలో ఇల్లు నిర్మించుకునేందుకు వెయ్యి చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తున్నామని, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
Sri Charani
Chandrababu Naidu
Indian Women's Cricket Team
ICC Women's World Cup
Nara Lokesh
Mithali Raj
Andhra Pradesh
Sports Authority of Andhra Pradesh
Cricket
Incentives

More Telugu News