Xi Jinping: 50 విమానాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన భారీ యుద్ధ నౌకను ప్రారంభించిన చైనా

Xi Jinping launches Chinas advanced Fujian aircraft carrier
  • పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన విమాన వాహన నౌక
  • హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో వేడుకలు జరిగినట్లు అధికార మీడియా వెల్లడి
  • యుద్ధ నౌకను పరిశీలించిన జిన్‌పింగ్
చైనా అత్యంత శక్తిమంతమైన 'ఫుజియాన్' (టైప్-003) యుద్ధ నౌకను ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ విమాన వాహక నౌకను ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రారంభించారు. హైనాన్ ద్వీపంలోని సైనిక నౌకాశ్రయంలో దీనికి సంబంధించిన వేడుకలు జరిగినట్లు స్థానిక అధికారక మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ యుద్ధ నౌకను పరిశీలించారని పేర్కొంది.

316 మీటర్ల పొడవు, 80 వేల టన్నుల బరువు కలిగిన ఫుజియాన్‌ విమాన వాహక నౌక దాదాపు 50 విమానాలను మోసుకెళ్లగలదు. ఇది చైనాకు చెందిన మూడవ అత్యంత ఆధునిక యుద్ధ నౌక. విద్యుదయస్కాంత ఆధారిత వ్యవస్థ అయిన ఈఎంఏఎల్ఎస్‌ను ఇందులో వినియోగించారు. ఈ తరహా సాంకేతికతను అమెరికాకు చెందిన గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ శ్రేణి విమాన వాహక నౌక మాత్రమే ఇప్పటివరకు వినియోగిస్తోంది.

ఈ నౌక బీజింగ్‌కు వ్యూహాత్మక సాధనంగా ఉపయోగపడుతుందని, దేశ గౌరవాన్ని పెంచుతుందని చైనా ఇటీవల పేర్కొంది. ఫుజియాన్ తర్వాత టైప్-004 విమాన వాహక నౌకను నిర్మించేందుకు కూడా చైనా సన్నాహాలు ప్రారంభించింది. దీనిని ఈఎంఏఎల్ఎస్‌తో పాటు అణు సామర్థ్యంతో నిర్మించాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అమెరికాతో పోటీపడుతూ చైనా తన ఆయుధ సంపత్తిని విస్తరిస్తోంది.
Xi Jinping
China navy
Fujian aircraft carrier
Type 003 carrier
Chinese military
South China Sea

More Telugu News