Sajjanar: వీళ్లేం సెలబ్రిటీలు?: రైనా, శిఖర్ ధావన్‌లపై సజ్జనార్ తీవ్ర ఆగ్రహం

Sajjanar Angered by Raina Dhawan Involvement in Betting Case
  • క్రికెటర్లకు చెందిన రూ.11 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
  • ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్పింగ్‌ను సామాజిక మాధ్యమంలో పంచుకున్న సజ్జనార్
  • అభిమానాన్ని సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని ప్రశ్న
ప్రముఖ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్‌పై హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అసహనం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో వీరికి చెందిన రూ. 11 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ మేరకు వార్తా కథనాన్ని తన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా పంచుకున్న సజ్జనార్, "వీళ్ళేం సెలబ్రిటీలు?" అంటూ వ్యాఖ్యానించారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీరు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలై ఎంతోమంది యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. వేలాదిమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని గుర్తు చేశారు. సమాజాన్ని ఛిద్రం చేస్తోన్న బెట్టింగ్ భూతాన్ని ప్రోత్సహించిన ఈ క్రికెటర్లు కూడా బాధ్యులేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సమాజానికి మేలు చేయడానికి, యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి సెలబ్రిటీలు మంచి మాటలు చెప్పాలని హితవు పలికారు. అభిమానించే వారిని తప్పుదోవ పట్టించి, వారి ప్రాణాలను తీయడానికి కారణం కావొద్దని సూచించారు.
Sajjanar
Suresh Raina
Shikhar Dhawan
Online Betting
ED Seizure
Hyderabad Police
Cricket Betting

More Telugu News