Sree Charani: శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ నజరానా... రూ. 2.5 కోట్లు, గ్రూప్-1 ఉద్యోగం

AP Govt Announces 25 Crore Reward Group 1 Job for Sree Charani
  • మహిళల ప్రపంచకప్ విజేత శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు
  • రూ. 2.5 కోట్ల నగదు, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలం ప్రకటన
  • సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో భేటీ అయిన శ్రీచరణి, మిథాలీ రాజ్
  • గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఏసీఏ పెద్దలు
  • నేడు కడపలో శ్రీచరణికి ఘన సన్మానం.. భారీ ర్యాలీకి ఏర్పాట్లు
మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగమ్మాయి, క్రికెటర్ శ్రీచరణిపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, సొంత జిల్లా కడపలో 1,000 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేర‌కు ఏపీ సీఎంఓ ట్వీట్ చేసింది. 

అలాగే మంత్రి లోకేశ్ కూడా ఈ విష‌య‌మై 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. "శ్రీచరణి అచంచల అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను గర్వపడేలా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమె అద్భుతమైన విజయాన్ని గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం, రూ. 2.5 కోట్ల నగదు బహుమతి, కడపలో నివాస స్థలంతో సత్కరిస్తుందని ప్రకటించడానికి సంతోషంగా ఉంది" అంటూ మంత్రి లోకేశ్ పోస్ట్‌ చేశారు.

అంతకుముందు శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో శ్రీచరణిని అభినందించిన చంద్రబాబు, ప్రపంచకప్‌ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని, ఎంతోమందికి స్ఫూర్తినిస్తారని కొనియాడారు. ప్రపంచకప్ గెలిచిన ఆనంద క్షణాలను శ్రీచరణి సీఎం, మంత్రితో పంచుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీచరణి మాట్లాడుతూ... ప్రపంచకప్ గెలిచిన తర్వాత దేశ ప్రజలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తన కుటుంబం అందించిన ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకొచ్చిందని, ముఖ్యంగా తన మామ తనను క్రికెట్ ఆడేందుకు ఎంతగానో ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందానని చెప్పారు. ఈ విజయం మొదటి అడుగు మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణపై విలువైన సలహాలు ఇచ్చారని పేర్కొన్నారు.

ఇక‌, ఇవాళ సాయంత్రం కడపలో ఏసీఏ, కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీచరణికి భారీ సన్మాన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Sree Charani
AP Government
Andhra Pradesh
Women's World Cup
Group 1 Job
Nara Lokesh
Chandrababu Naidu
Kadapa
Cricket
Mithali Raj

More Telugu News