Sumit Sabharwal: అహ్మదాబాద్ విమాన ప్రమాదం: పైలట్‌ను నిందించలేం: సుప్రీంకోర్టు

Sumit Sabharwal Not to Blame in Ahmedabad Plane Crash Says Supreme Court
  • అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటన
  • కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏలకు సుప్రీంకోర్టు నోటీసులు 
  • పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ
అహ్మదాబాద్‌లో 260 మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో పైలట్-ఇన్-కమాండ్‌ను నిందించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)లకు నోటీసులు జారీ చేసింది.

ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానానికి పైలట్-ఇన్-కమాండ్‌గా పనిచేసిన సుమీత్ సబర్వాల్ ఈ ప్రమాదంలో మరణించారు. ఆయన తండ్రి పుష్కరాజ్ సబర్వాల్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎఫ్ఐపీ) ఈ ఘటనపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ఈ ఏడాది జులైలో విడుదల చేసిన ప్రాథమిక నివేదికను వారు తమ పిటిషన్‌లో సవాల్ చేశారు.

విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయిందని ఏఏఐబీ తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. రెండు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా "కటాఫ్" పొజిషన్‌లోకి వెళ్లాయని తెలిపింది. సుమారు 10 సెకన్ల తర్వాత స్విచ్‌లను తిరిగి ఆన్ చేసినప్పటికీ, అప్పటికే ఇంజిన్లు ఆగిపోయి (ఫ్లేమ్డ్ అవుట్) విమానం కుప్పకూలిందని నివేదికలో వివరించింది.

అయితే, ఈ నివేదికతో విభేదిస్తూ పైలట్ తండ్రి, పైలట్ల సంఘం దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, పైలట్‌ను నిందించలేమని వ్యాఖ్యానిస్తూ కేంద్రం, డీజీసీఏల నుంచి వివరణ కోరింది. ఈ కేసులో తదుపరి విచారణ జరగనుంది.
Sumit Sabharwal
Ahmedabad plane crash
Air India
Boeing 787 Dreamliner
DGCA
fuel control switch
plane crash investigation
aviation accident
Federation of Indian Pilots
AAIB

More Telugu News