Russia: పాక్ పత్రికపై రష్యా ఫైర్.. అది అమెరికా అజెండాతో నడుస్తోందని మండిపాటు!

Russia Fires on Pakistani Newspaper The Frontier Post
  • పాకిస్థాన్ ఆంగ్ల పత్రిక 'ది ఫ్రాంటియర్ పోస్ట్'పై రష్యా ఆగ్రహం
  • పత్రికలో రష్యా వ్యతిరేక కథనాలు వస్తున్నాయని ఆరోపణ
  • అది పాకిస్థానీ పత్రిక కాదు, దాని హెడ్ ఆఫీస్ వాషింగ్టన్‌లో ఉందని వ్యాఖ్య
పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఫ్రాంటియర్ పోస్ట్’పై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పత్రిక రష్యాకు వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా కథనాలు ప్రచురిస్తోందని, దాని వెనుక అమెరికా అజెండా ఉందని సంచలన ఆరోపణలు చేసింది. ఈ మేరకు పాకిస్థాన్‌లోని రష్యా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

"పాకిస్థాన్ ఆంగ్ల పత్రిక అయిన 'ది ఫ్రాంటియర్ పోస్ట్'లో నిరంతరం వస్తున్న రష్యా వ్యతిరేక కథనాలను మేం గమనించాం. నిజానికి దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్‌లో ఉన్నందున, దీనిని పాకిస్థానీ పత్రిక అని పిలవలేం" అని రష్యా ఎంబసీ తన పోస్టులో పేర్కొంది. పత్రిక సంపాదకీయ బృందం అమెరికా ప్రభావంతో పనిచేస్తోందని, రష్యా విదేశాంగ విధానాన్ని, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని నిరంతరం విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించింది.

రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉన్నట్లు చిత్రీకరించేందుకు ఈ పత్రిక ప్రయత్నిస్తోందని రష్యా విమర్శించింది. బయటి నుంచి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా తమ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఎన్నడూ లేనంత స్థిరంగా పురోగమిస్తోందని స్పష్టం చేసింది. 2024లో రష్యా జీడీపీ 4.1 శాతం వృద్ధి సాధించిందని గుర్తుచేసింది.

ఆఫ్ఘనిస్థాన్ అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన 'మాస్కో ఫార్మాట్ ఆఫ్ కన్సల్టేషన్స్' వంటి కీలక పరిణామాలను ఈ పత్రిక పూర్తిగా విస్మరించిందని రష్యా తెలిపింది. తమ దేశానికి సానుకూలంగా ఒక్క వార్త కూడా ఇప్పటివరకు ప్రచురించలేదని, ఇతర దేశాల అజెండానే మోస్తోందని రష్యా తన ప్రకటనలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Russia
The Frontier Post
Pakistan
US Agenda
Vladimir Putin
Russia Economy
Moscow Format of Consultations
Afganistan

More Telugu News