Indian Women's Cricket Team: ప్రపంచకప్ విజేతలకు టాటా కానుక.. ఒక్కొక్కరికీ సరికొత్త సియెర్రా కారు

Indian Womens Cricket Team Gifted Tata Sierra Cars After World Cup Win
  • ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అరుదైన గౌరవం
  • జట్టులోని ప్రతి సభ్యురాలికి టాటా సియెర్రా కారు బహుమతి
  • త్వరలో విడుదల కానున్న కారు మొదటి బ్యాచ్‌ను క్రీడాకారిణులకు కేటాయింపు
  • మహిళా జట్టును అభినందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
  • మీరు దేశ యువతకు ఆదర్శమంటూ రాష్ట్రపతి ప్రశంస
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌ను తొలిసారి గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురుస్తోంది. ఈ చరిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి తమ సరికొత్త 'టాటా సియెర్రా' ఎస్‌యూవీని బహుమతిగా అందిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ వాహనం మొదటి బ్యాచ్‌ను పూర్తిగా మహిళా జట్టుకే కేటాయించడం విశేషం.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. "లెజెండ్స్ మీట్స్ లెజెండ్స్. భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన అద్భుతమైన ప్రపంచకప్ విజయాన్ని పురస్కరించుకుని, జట్టులోని ప్రతి సభ్యురాలికి టాటా సియెర్రాను బహుమతిగా అందిస్తున్నందుకు గర్వంగా ఉంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది. క్రీడాకారిణులందరికీ టాప్-ఎండ్ మోడల్ కార్లను అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క‌లిసిన ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌లు
మరోవైపు ప్రపంచకప్ విజేతలు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, క్రీడాకారులందరి సంతకాలతో కూడిన జెర్సీని రాష్ట్రపతికి బహూకరించారు. అనంతరం ప్రపంచకప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి చూపించారు. భారత జట్టును అభినందించిన ద్రౌపది ముర్ము, వారు చరిత్ర సృష్టించడమే కాకుండా దేశంలోని యువతరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. "ఈ జట్టు యావత్ భారతదేశానికి ప్రతిబింబం. విభిన్న ప్రాంతాలు, సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినా వారంతా ఒక్కటే 'టీమ్ ఇండియా' అని రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది.

కాగా, ఈ జట్టు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసిన విషయం తెలిసిందే. గత వారం నవీ ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, భారత మహిళల జట్టు తమ మొట్టమొదటి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
Indian Women's Cricket Team
Harmanpreet Kaur
Tata Motors
Tata Sierra
ICC Womens World Cup
Droupadi Murmu
Narendra Modi
Womens Cricket
Cricket World Cup
Team India

More Telugu News