Chandrababu Naidu: చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు

Chandrababu Naidu Holds Conference on Data Driven Governance
  • సదస్సుకు హాజరైన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు
  • వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు
  • ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు హాజరయ్యారు. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ లక్ష్యం కూడా అదేనని ఆయన అన్నారు. అందుకు అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించినట్లు వెల్లడించారు.

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలని వ్యాఖ్యానించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్థంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని పిలుపునిచ్చారు. అంతా కలిసికట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫాన్‌ను సాంకేతిక వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగినట్లు వెల్లడించారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామని అన్నారు.

డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని ముఖ్యమంత్రి అన్నారు. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్థంగా వనరులను వినియోగించగలుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని అన్నారు.

2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. నెలలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందని అన్నారు. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Data driven governance
Vision 2047
CFMS system
Amaravati

More Telugu News