Andhra Pradesh Rains: నేడు ఏపీకి వర్ష సూచన.. 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు

Andhra Pradesh Rains Forecast Thunderstorms Expected in 9 Districts
  • బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావం
  • మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని, దీని ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు నమోదవుతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేశారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించారు.

వర్షాల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని ప్రఖర్ జైన్ హెచ్చరించారు.

కాగా, నిన్న సాయంత్రం 4 గంటల సమయానికి ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 65.2 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లా గండ్లపెంటలో 45 మి.మీ., నెల్లూరు జిల్లా రాపూర్‌లో 40.5 మి.మీ., విజయవాడ తూర్పులో 39 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తుల శాఖ వెల్లడించింది. 
Andhra Pradesh Rains
AP Weather
Rain Alert
IMD Forecast
Thunderstorms
Heavy Rainfall
Prakhar Jain
AP Disaster Management
Krishna District
Nellore

More Telugu News