TTD: భక్తులకు శుభవార్త.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

TTD to Offer Sri Vari Darshan in 2 Hours Using AI Says BR Naidu
  • ఏఐ టెక్నాలజీతో 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం
  • దళితవాడల్లో 5 వేల వెంకన్న ఆలయాల నిర్మాణం
  • అన్ని రాష్ట్ర రాజధానుల్లో టీటీడీ ఆలయాలు
  • తిరుపతి ఫ్లైవోవర్‌కు తిరిగి ‘గరుడ వారధి’ అని పేరు
  • విశాఖ శారదా పీఠం భూముల లీజు రద్దు
  • ఏడాదిలో టీటీడీకి రూ.1000 కోట్ల విరాళాలు
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ సాయంతో స్వామివారి దర్శనాన్ని కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ బోర్డు ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే విజయవంతమైందని, త్వరలోనే ఈ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో రాష్ట్రంలోని దళిత వాడల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రాథమికంగా 5 వేలకు పైగా వాడల్లో ఆలయాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వివరించారు.

తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో 25 వేల మంది భక్తులకు వసతి, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచనలో ఉన్నామని బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే, ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదులతో వసతి గృహం నిర్మించడంతో పాటు, 108 అడుగుల భారీ జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

తిరుపతి ఫ్లైవోవర్ పేరు మార్పు
గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మార్చినట్లు ఆయన స్పష్టం చేశారు. తిరుపతి ఫ్లైవోవర్‌కు ‘శ్రీనివాస సేతు’గా పెట్టిన పేరును తిరిగి ‘గరుడ వారధి’గా మార్చామన్నారు. తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీ వేంకటేశ్వర ఎయిర్‌పోర్టు’గా నామకరణం చేస్తూ ఫైలును రాష్ట్ర క్యాబినెట్‌కు పంపామని, ఆమోదం తర్వాత కేంద్రానికి పంపుతామని తెలిపారు. విశాఖ శారదా పీఠానికి తిరుమల కొండపై కేటాయించిన భూముల లీజులను రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. తన ఏడాది పాలనలో టీటీడీకి రూ.1,000 కోట్ల విరాళాలు అందాయని, దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని అమలు చేస్తామని బీఆర్ నాయుడు వివరించారు.
TTD
Tirumala
Sri Vari Darshan
BR Naidu
Artificial Intelligence
Venkateswara Temple
Tirupati
Garuda Varadhi
Sri Venkateswara Airport
Dalit Colonies

More Telugu News