Nara Lokesh: సింగపూర్ పర్యటనకు 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటన

Nara Lokesh Announces Singapore Tour for 78 Teachers
  • విద్యాశాఖపై లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
  • ఏపీ విద్యారంగంలో కీలక మార్పులు
  • అధునాతన విద్యపై అధ్యయనానికి సింగపూర్ కు టీచర్లు
  • డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్
  • క్షేత్రస్థాయిలోకి వెళ్లాలంటూ డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలు
  • రాష్ట్రవ్యాప్తంగా కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో సంస్కరణలను వేగవంతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతల్లో 78 మందిని అధునాతన విద్యావిధానాలపై అధ్యయనం కోసం సింగపూర్‌కు పంపనున్నట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. బుధవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఎంపిక చేసిన 78 మంది ఉపాధ్యాయులను ఈనెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 2 వరకు వారం రోజుల పాటు ఈ బృందం సింగపూర్‌లోని ప్రముఖ పాఠశాలలను సందర్శిస్తుంది. అక్కడి బోధనా పద్ధతులు, తరగతి గదుల్లో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికత, పాఠశాల వాతావరణం వంటి అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఒక నివేదిక సమర్పించాలని కోరారు.

డిసెంబర్ 5న మెగా పీటీఎం

గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా డిసెంబర్ 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్ మీట్ (పీటీఎం)ను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. విద్యార్థుల ప్రతిభ, పనితీరును తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన ‘లీప్’ యాప్‌పై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే

జిల్లా, మండల స్థాయి విద్యాశాఖ అధికారులు (డీఈవోలు, ఎంఈవోలు) తప్పనిసరిగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, పాఠశాలల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని లోకేశ్ గట్టిగా ఆదేశించారు. పరిపాలనలో పారదర్శకత కోసం ఈ-ఆఫీసు విధానాన్ని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్)పై లీప్-1 మార్గదర్శకాలకు అనుగుణంగా వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ‘కడప మోడల్ స్మార్ట్ కిచెన్ల’ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో భవిత ఆటిజం సపోర్ట్ కేంద్రాల ఏర్పాటు, జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ‘పరఖ్’ వంటి విధానాల అమలు, ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌ల కోసం 8వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడం, అమరావతిలో సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు, పబ్లిక్, డిజిటల్ లైబ్రరీల బలోపేతం వంటి అంశాలపై కూడా చర్చించారు. ఈ సమీక్షలో మానవవనరులశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయ రామరాజు, సమగ్రశిక్ష స్టేట్ కోఆర్డినేటర్ బి. శ్రీనివాసరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Education
Singapore tour
Teachers training
Education reforms
Mega PTM
Leap app
Smart kitchens
Andhra Pradesh schools
Education department

More Telugu News