Hair Loss: యువతలో పెరుగుతున్న బట్టతల.. కారణాలేంటి? పరిష్కారాలు ఉన్నాయా?

Hair Loss Causes Solutions for Youth
  • యువతలో ఆందోళన కలిగిస్తున్న బట్టతల సమస్య
  • జన్యువులతో పాటు ఆధునిక జీవనశైలి ప్రధాన కారణం
  • నుదుటి భాగంలో జుట్టు తగ్గడం తొలి లక్షణం
  • సొంత వైద్యం వద్దు, నిపుణుల సలహా తప్పనిసరి
  • స్మోకింగ్ మానేయడం వల్ల సమస్య తీవ్రతను తగ్గించవచ్చు
స్నానం చేసేటప్పుడు లేదా దువ్వుకునేటప్పుడు కొన్ని వెంట్రుకలు రాలడం సహజం. కానీ, నుదుటి భాగంలో జుట్టు క్రమంగా వెనక్కి వెళ్లడం, తల పైభాగంలో పల్చబడటం వంటివి కనిపిస్తే అది ‘మేల్ ప్యాటర్న్ బట్టతల’ (ఆండ్రోజెనెటిక్ అలోపేసియా)కు సంకేతం కావచ్చు. ఇది పురుషులలో జుట్టు రాలడానికి అత్యంత సాధారణ కారణం. భారత్‌లో ఈ సమస్య యువతలో ఎక్కువగా కనిపిస్తోందని చర్మవ్యాధి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జన్యుపరమైన కారణాలతో పాటు ఆధునిక జీవనశైలి, తీవ్రమైన ఒత్తిడి, స్మోకింగ్, కాలుష్యం, పోషకాహార లోపం వంటివి ఈ సమస్యను మరింత వేగవంతం చేస్తున్నాయి.

బట్టతల ఎందుకు వస్తుంది?

బట్టతలకు ప్రధాన కారణం జన్యువులు, హార్మోన్లు. శరీరంలో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్, డైహైడ్రోటెస్టోస్టెరాన్ (DHT)గా మారుతుంది. ఈ డీహెచ్‌టీ తలలోని హెయిర్ ఫోలికల్స్‌ (వెంట్రుక కుదుళ్లు)పై ప్రభావం చూపి, వాటిని బలహీనపరుస్తుంది. దీంతో వెంట్రుకలు సన్నగా, పొట్టిగా మారి క్రమంగా రాలిపోతాయి. కుటుంబంలో, ముఖ్యంగా తల్లి వైపు వారికి బట్టతల ఉంటే, ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఈ ముప్పు మరింత పెరుగుతుంది.

ప్రారంభ లక్షణాలు గుర్తించడం ముఖ్యం

ప్రారంభ దశలోనే ఈ సమస్యను గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. 

సాధారణంగా కనిపించే లక్షణాలు:

* నుదుటి దగ్గర ఇంగ్లిష్ అక్షరం 'M' ఆకారంలో జుట్టు తగ్గడం.
* తల మధ్యభాగంలో లేదా పైభాగంలో జుట్టు పల్చబడటం.
* దువ్వినప్పుడు లేదా తలస్నానం చేసినప్పుడు మామూలు కంటే ఎక్కువగా జుట్టు రాలడం.

ఈ లక్షణాలు 3 నుంచి 6 నెలల పాటు కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఈ సమస్యకు శాస్త్రీయంగా నిరూపితమైన అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, వైద్యుని పర్యవేక్షణ లేకుండా ఎలాంటి చికిత్సను సొంతంగా ప్రారంభించకూడదు.

చేయాల్సినవి... చేయకూడనివి

జుట్టు పల్చబడుతున్నట్టు అనిపిస్తే వెంటనే నిపుణులను సంప్రదించాలి. స్మోకింగ్ మానేయడం, ఒత్తిడి తగ్గించుకోవడం, పోషకాహారం తీసుకోవడం వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి. సొంత వైద్యం, ఆన్‌లైన్‌లో కనిపించే అద్భుత నివారణలను గుడ్డిగా నమ్మవద్దు. సరైన సమయంలో సరైన వైద్య సలహా తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని అదుపులో ఉంచుకుని, ఉన్న జుట్టును కాపాడుకోవచ్చు.
Hair Loss
Male Pattern Baldness
Androgenetic Alopecia
DHT
Hair Follicles
Testosterone
Hair Thinning
Youth Hair Loss
Telangana Health
Hair Loss Treatment

More Telugu News