Botsa Satyanarayana: ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదా?: బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana Slams Chandrababu on Public Safety
  • కాశీబుగ్గ ఘటన ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్న బొత్స
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శ
  • నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలపై ఎందుకు చర్యలు లేవని ప్రశ్న
వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యలు, కాశీబుగ్గ తొక్కిసలాట ఘటన వంటి పలు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ప్రకృతి విపత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం నుంచి కనీస భరోసా కరవైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన బొత్స, తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. "వైసీపీ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర, సబ్సిడీ అందించడంతో పాటు పంటల బీమా ప్రీమియంను కూడా ప్రభుత్వమే చెల్లించింది. కానీ ఈ ప్రభుత్వం ఆ భారాన్ని రైతులపైనే మోపుతోంది. ఇప్పటివరకు పంట నష్టంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. సీఎం, మంత్రుల మాటలు తప్ప చేతల్లో ఏమీ కనిపించడం లేదు" అని విమర్శించారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై బొత్స తీవ్రంగా స్పందించారు. అది ప్రైవేట్ ఆలయమని చెప్పడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. "ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రజల ప్రాణాలంటే చంద్రబాబుకు లెక్కలేదా?" అని నిలదీశారు. తిరుపతి, సింహాచలం ఘటనల నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ఆయన విమర్శించారు.

ప్రభుత్వ వైఫల్యాలు బయటపడిన ప్రతిసారీ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మరల్చడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని బొత్స ఆరోపించారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ నేత జయచంద్రారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్ కేసులోనూ టీడీపీ నేతలను వదిలేశారని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఎల్లో మీడియాను చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో నిర్మాణానికి అవసరమైన అప్రోచ్ రోడ్లు, ఇతర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రైతులు, వైద్యం, విద్య, భక్తుల భద్రత వంటి ఏ అంశంలోనూ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బొత్స విమర్శించారు.
Botsa Satyanarayana
Andhra Pradesh
AP Politics
Chandrababu Naidu
YSRCP
Kashibugga stampede
Farmers issues
Crop damage
TDP
Fake liquor case

More Telugu News