KTR: 'జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక' విడుదల చేసిన కేటీఆర్... రేవంత్ రెడ్డికి సవాల్

KTR Releases Jubilee Hills Progress Report Challenges Revanth Reddy
  • కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే ఈరోజు కూర్చుంటున్నారన్న కేటీఆర్
  • హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్ అత్యంత భద్రత కలిగిన నగరంగా తయారు చేశారన్న కేటీఆర్
  • కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పెరిగిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక నివేదికను విడుదల చేశారు. 'జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక' పేరుతో తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా, గత రెండేళ్లలో నగరంలో ఒక్క ఫ్లైఓవర్ అయినా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు.

కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే రేవంత్ రెడ్డి ఈరోజు కూర్చుని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాద్ నగరాన్ని అత్యంత భద్రత కలిగిన నగరంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దిందని అన్నారు. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు 41 శాతం, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60 శాతం పెరిగిందని ఆయన ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో పట్టపగలు నేరాలు జరుగుతున్నాయని, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు పెట్టి బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అన్నారు. నగరంలో తుపాకీ సంస్కృతి పెరిగిందని విమర్శించారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి, హోంమంత్రి అయినా, ఆయన చేతిలో పవర్ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ముంబై పోలీసులు వచ్చి చర్లపల్లిలో రూ. 12 వేల కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎవరు చెత్త నగరంగా మార్చారో చర్చకు రావాలని సవాల్ విసిరారు.

కాంగ్రెస్ లేకుంటే ముస్లింలు లేరనే అభిప్రాయం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ భ్రమ నుంచి ముఖ్యమంత్రి బయటకు వస్తే మంచిదని హితవు పలికారు. మనది లౌకికవాద దేశమని అన్నారు. దీనిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకపోయినా ముస్లింలు ఉంటారని అన్నారు.
KTR
K Taraka Rama Rao
Jubilee Hills
Revanth Reddy
BRS
Telangana
Hyderabad
Crime Rate

More Telugu News