Rahul Gandhi: హర్యానాలో ప్రతీ 8 ఓటర్లలో ఒకరు ఫేక్.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

Haryana Elections One in Eight Voters is Fake Says Rahul Gandhi
  • మొత్తం ఓటర్లలో 12.5 శాతం ఫేక్ ఓటర్లే
  • బ్రెజిల్ కు చెందిన మోడల్ హర్యానాలో మూడు ఓట్లు
  • ఒకే మహిళ వందసార్లు ఓటేసిందని రాహుల్ ఆరోపణ
హర్యానా ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం ఉదయం ‘హైడ్రోజన్ బాంబ్’ పేరుతో మీడియాతో లైవ్ ఏర్పాటు చేసి హర్యానా ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తూ వివరించారు.

హర్యానాలోని ప్రతీ ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరేనని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మొత్తంగా 12.5 శాతం మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు. బ్రెజిల్ కు చెందిన మోడల్ ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమ, స్వీటీ, సరస్వతి పేరుతో మూడుసార్లు ఓటేసిందని ఆయన చెప్పారు. ఒకే మహిళ, ఒకే ఫొటోతో వేర్వేరు పోలింగ్ బూత్ లలో వంద ఓట్లు వేసిందన్నారు. రాహుల్ గాంధీ సాక్ష్యాలతో పాటుగా ఈ ఆరోపణలు చేశారు.

ఓటర్ జాబితాలోని తప్పులను స్క్రీన్ పై ప్రదర్శిస్తూ.. పోలింగ్ సందర్భంగా బూత్ లెవల్ నుంచే అక్రమాలు జరిగాయని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ తలుచుకుంటే ఓటర్ జాబితాలోని ఈ అక్రమాలను కేవలం క్షణాల వ్యవధిలో తొలగించగలదని అన్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీకి ఈసీ వంతపాడుతూ అక్రమాలకు కొమ్ముకాస్తోందని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు.

ఓటు హక్కు నమోదుకు హౌస్ నెంబర్ తప్పనిసరి కావడంతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇబ్బంది కలుగుతోందని ఈసీ ఓ కొత్త రూల్ తీసుకొచ్చిందని రాహుల్ గుర్తు చేశారు. ఇల్లు లేని నిరుపేదలు ఓటు హక్కు నమోదు సమయంలో ఇంటి నెంబర్ ను ‘జీరో’ గా పేర్కొనే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. అయితే, ఈ విధానం వెనక నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలనే సదుద్దేశం కన్నా అక్రమ ఓటర్లు, ఫేక్ ఓటర్లకు జాబితాలో చోటు కల్పించాలనే దురుద్దేశమే ఉందని రాహుల్ విమర్శించారు.

ఎన్నికల జాబితాలో ఇంటి నెంబర్ జీరోగా పేర్కొన్న పలు ఓటర్ల ఇళ్లను తన టీమ్ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించిందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో జరిపిన ఈ పరిశీలనలో సంచలన విషయాలు బయటపడ్డాయని రాహుల్ చెప్పారు. ఇంటి నెంబర్ జీరోగా పేర్కొన్న ఓ నిరుపేద ఇల్లు ఇదేనంటూ స్క్రీన్ పై ఓ భారీ భవంతిని చూపించారు. ఇంత పెద్ద భవనానికి ఇంటి నెంబర్ లేదని, ఈ ఇంటి యజమాని పేరు సహా పలువురు అక్రమార్కులకు ఇదే విధంగా ఓటు హక్కు కల్పించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
Rahul Gandhi
Haryana elections
Fake voters
Election Commission
Voter list
Electoral fraud
BJP
Corruption
Voter ID
House number

More Telugu News