Subramanyam Vedam: 43 ఏళ్లుగా జైలుపాలు.. నిర్దోషిగా విడుదల.. ఇప్పుడు దేశ బహిష్కరణ.. భారత సంతతి వ్యక్తికి అందని న్యాయం!

Subramanyam Vedam Faces Deportation After 43 Years Wrongful Imprisonment
  • హత్య కేసులో 43 ఏళ్లు జైల్లో గడిపిన భారత సంతతి వ్యక్తి
  • నిర్దోషిగా తేలినా దేశ బహిష్కరణకు ఇమ్మిగ్రేషన్ అధికారుల యత్నం
  • సుబ్రమణ్యం వేదం బహిష్కరణపై రెండు అమెరికా కోర్టులు స్టే
  • పాత డ్రగ్స్ కేసును కారణంగా చూపుతున్న ఇమ్మిగ్రేషన్ విభాగం
అమెరికాలో 43 ఏళ్ల పాటు ఓ హత్య కేసులో నిర్దోషిగా జైలు శిక్ష అనుభవించిన భారత సంతతి వ్యక్తికి తాత్కాలిక ఊరట లభించింది. అతడిని దేశం నుంచి బహిష్కరించవద్దని రెండు అమెరికా కోర్టులు ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించాయి. సుబ్రమణ్యం వేదం (64) అనే ఈ వ్యక్తి కేసు వివరాలు, ఆయన ఎదుర్కొంటున్న కష్టాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి.

సుబ్రమణ్యం వేదం తన తొమ్మిది నెలల వయసులో తల్లిదండ్రులతో కలిసి చట్టబద్ధంగా భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఆయన తండ్రి ప్రొఫెసర్‌గా పనిచేయడంతో అక్కడే పెరిగారు. అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కలిగిన వేదం, 1982లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అరెస్ట్ అయ్యారు.

ఏమిటీ కేసు?
1980లో తన స్నేహితుడు థామస్ కిన్సర్ హత్యకు గురయ్యాడు. చివరిసారిగా కిన్సర్‌తో కనిపించింది వేదమే కావడంతో, ఎలాంటి బలమైన సాక్ష్యాలు లేకపోయినా పోలీసులు అతడిని నిందితుడిగా చేర్చారు. కోర్టు రెండుసార్లు అతడిని దోషిగా నిర్ధారించింది. అయితే, 40 ఏళ్లకు పైగా న్యాయపోరాటం చేసిన వేదం తరఫు న్యాయవాదులు, ప్రాసిక్యూటర్లు దాచిపెట్టిన కీలకమైన బాలిస్టిక్స్ ఆధారాలను ఇటీవల బయటపెట్టారు.

దీంతో ఈ ఏడాది ఆగస్టులో న్యాయమూర్తి ఆయన శిక్షను రద్దు చేసి, నిర్దోషిగా ప్రకటించారు. అక్టోబర్ 3న పెన్సిల్వేనియా జైలు నుంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాల్సిన వేదంను, ఇమ్మిగ్రేషన్ అధికారులు నేరుగా అదుపులోకి తీసుకున్నారు. బహిష్కరణల కోసం ప్రత్యేకంగా ఎయిర్‌స్ట్రిప్ ఉన్న లూసియానాలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు.

బహిష్కరణకు ఎందుకు యత్నిస్తున్నారు?
సుమారు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఎల్‌ఎస్‌డీ డెలివరీకి సంబంధించిన డ్రగ్స్ కేసులో వేదంపై ఆరోపణలు ఉన్నాయి. దీనిని కారణంగా చూపుతూ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులు ఆయనను బహిష్కరించాలని చూస్తున్నారు. అయితే, చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో గడిపిన వ్యక్తి విషయంలో ఈ పాత కేసును పరిగణనలోకి తీసుకోరాదని, జైల్లో ఉన్నప్పుడే ఆయన డిగ్రీలు సంపాదించి, తోటి ఖైదీలకు ట్యూటర్‌గా సేవలందించారని ఆయన న్యాయవాదులు వాదిస్తున్నారు.

ఈ విషయంపై హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం స్పందిస్తూ.. హత్య కేసులో తీర్పు మారినంత మాత్రాన, పాత డ్రగ్స్ కేసు శిక్ష రద్దు కాదని స్పష్టం చేసింది. అయితే, తాజాగా ఇమ్మిగ్రేషన్ కోర్టుతో పాటు, పెన్సిల్వేనియాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా ఆయన బహిష్కరణపై స్టే విధించాయి. 

"రెండు వేర్వేరు కోర్టులు సుబు (సుబ్రమణ్యం) బహిష్కరణ సరికాదని చెప్పడం మాకు ఉపశమనం కలిగించింది. చేయని నేరానికి 43 ఏళ్లు జైల్లో మగ్గిన వ్యక్తికి మరో అన్యాయం జరగదని ఆశిస్తున్నాం" అని ఆయన సోదరి సరస్వతి వేదం అన్నారు. ప్రస్తుతం ఆయన కేసుపై ఇమ్మిగ్రేషన్ అప్పీల్స్ బోర్డు తుది నిర్ణయం తీసుకోవడానికి కొన్ని నెలలు పట్టవచ్చు.
Subramanyam Vedam
Vedam
Indian American
wrongful conviction
deportation
immigration
Pennsylvania
Thomas Kinser
LSD drug case
court case

More Telugu News