Chandrababu Naidu: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. లండన్‌లో పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు భరోసా

Chandrababu Naidu AP is the Right Time for Investments Assures Industrialists in London
  • అంతర్గత జలరవాణాకు ఏపీలో పుష్కల అవకాశాలున్నాయని వెల్లడి
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్, అమరావతిలో ఏఐ సెంటర్ ఏర్పాటుపై వివరణ
  • అరుదైన ఖనిజాల వెలికితీతకు యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని పిలుపు
  • రాష్ట్రాన్ని కీలక లాజిస్టిక్ కారిడార్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లండన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, టెక్నాలజీ, ఖనిజ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరిస్తూ, పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అలాగే ఈ నెలలో జరగనున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని కోరారు.
 
రాష్ట్రంలో రోడ్డు, రైలు, వాయు మార్గాలతో పాటు అంతర్గత జలరవాణాకు అపారమైన వనరులు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. తక్కువ ఖర్చుతో సరుకు రవాణా చేసేందుకు వీలుగా జల మార్గాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములు కావాలని లండన్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ 'ఆరుప్'ను ఆయన కోరారు. ఏపీని ఒక కీలకమైన లాజిస్టిక్ కారిడార్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు.
 
టెక్నాలజీ రంగంలో ఏపీ వేగంగా అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా, అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐ వినియోగం, నిపుణుల తయారీ, ఎకోసిస్టమ్ అభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.
 
అదేవిధంగా, రాష్ట్రంలో అరుదుగా లభించే భూగర్భ ఖనిజాల వెలికితీతలో యూనివర్సిటీలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ పరిశోధనల ద్వారా ఖనిజాలను వెలికితీసి, ప్రపంచ అవసరాలకు అనుగుణంగా వినియోగించుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్, పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, మాంచెస్టర్ యూనివర్సిటీ నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయాతో పాటు పలువురు ప్రముఖులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh investments
AP logistics
Technology sector AP
Mining AP
Partnership Summit
Arup Group
Artificial Intelligence India
Visakhapatnam Google Data Center
Amaravati AI Center

More Telugu News