Pawan Kalyan: అడవి ఏనుగులను కట్టడి చేసేందుకు టెక్నాలజీ సాయం: పవన్ కల్యాణ్

Pawan Kalyan uses technology to control wild elephants
  • చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా వినూత్న వ్యవస్థ ప్రారంభం
  • సౌరశక్తితో పనిచేస్తూ ఏనుగులను శబ్దాలతో భయపెట్టే సాంకేతికత
  • ఏనుగు సంచారాన్ని గుర్తించి అటవీ అధికారులకు తక్షణ సమాచారం
  • ఇప్పటికే కర్ణాటక నుంచి 4 కుంకీ ఏనుగులను తీసుకొచ్చిన ప్రభుత్వం
  • ఏనుగుల నియంత్రణలో ఏపీ విధానాలు ఆదర్శమన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్న అడవి ఏనుగుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), సౌరశక్తి ఆధారంగా పనిచేసే వినూత్న వ్యవస్థను చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించినట్లు ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ టెక్నాలజీ ద్వారా ఏనుగుల సంచారాన్ని ముందుగానే గుర్తించి, వాటిని భయపెట్టి తిరిగి అడవిలోకి పంపించడం సాధ్యమవుతుందని ఆయన వివరించారు.

ఈ వినూత్న వ్యవస్థను ఏనుగులు సంచరించే మార్గాల్లో ఏర్పాటు చేస్తారు. ఇది తన పరిధిలోకి ఏనుగు రాగానే గుర్తించి, వెంటనే తుపాకీ పేలినట్లు పెద్ద శబ్దాలు చేస్తుంది. ఆ శబ్దాలకు భయపడి ఏనుగులు వెనుదిరుగుతాయి. అదే సమయంలో అటవీ శాఖ అధికారులకు వెంటనే సంకేతాలు పంపి, వారిని అప్రమత్తం చేస్తుంది. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థ, ఏర్పాటు చేసిన ప్రాంతంలో 60 మీటర్ల పరిధిలో 120 డిగ్రీల కోణంలో నిరంతరం పర్యవేక్షిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ విధానం వల్ల మనుషులతో పాటు వన్యప్రాణులకు కూడా రక్షణ కలుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

గతంలో ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి నాలుగు కుంకీ ఏనుగులను రాష్ట్రానికి తీసుకువచ్చిన విషయాన్ని పవన్ గుర్తుచేశారు. గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న అడవి ఏనుగులను ఈ కుంకీలు విజయవంతంగా అడవుల్లోకి మళ్లిస్తున్నాయన్నారు. ఇప్పుడు వాటికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతను కూడా వినియోగించడం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కుంకీల నుంచి కృత్రిమ మేధ వరకు, ఏనుగుల నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శనీయంగా నిలుస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 
Pawan Kalyan
Andhra Pradesh
forest elephants
artificial intelligence
AI technology
Chittoor district
solar power
wildlife protection
kunki elephants
forest department

More Telugu News