చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ప్రకటన
- రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొని 19 మంది దుర్మరణం
- ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ
- మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం
- గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థిక సాయం
ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందిస్తామని వెల్లడించారు. ప్రమాద వార్త తెలియగానే స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.